KTR : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన ఖర్మ మాకు లేదు : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

KTR : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన ఖర్మ తమకు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బంగ్లాదేశం తరహాలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని పడగొడతారని చెప్పారు. ప్రపంచ దేశాల్లో ఎంతో మంది నియంతలకు ప్రజలకు గుణపాఠం చెప్పారని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మళ్లీ 20 ఏళ్ల వరకు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయరని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు అన్ని విషయాలు అర్థం కావాలన్నారు. ముఖ్యమంత్రి ఆర్థిక దోపిడీ, పర్యావరణ విధ్వంసంపై సిట్టింగ్ జడ్జి లేదా స్వతంత్ర దర్యాపు సంస్థతో విచారణ చేయాలని కోరారు. మరొకరు ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో రాజీనామా చేసేవారన్నారు. రేవంత్‌కి ధైర్యం ఉంటే భద్రత లేకుండా ప్రజల్లో వెళ్లాలని డిమాండ్ చేశారు.
సీఎస్, అధికారులు బలవుతున్నారు..
మాటల వేట ముఖ్యమంత్రిదేనని, సీఎస్, అధికారులు బలవుతున్నారని మండిపడ్డారు. ఐఏఎస్, అటవీ అధికారుల వంతైందన్నారు. ఇతర అధికారులూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రేవంత్ సైన్యంలా కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇష్టానుసారం కేసులు పెట్టిన వారిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. రేవంత్‌రెడ్డి ప్రైవేట్ ముఠాలా పనిచేస్తున్న పోలీసులు ఊచలు లెక్కించాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు ఎండగట్టిందని దుయ్యబట్టారు.
బీజేపీకి చిత్తశుద్ధి ఉందా? లేదా? అనే దానిపై నెలాఖరు వరకు ఎదురుచూస్తామన్నారు. నెలాఖరులో బీఆర్ఎస్ భేటీ తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థల వద్దకు వెళ్తామన్నారు. ఆధారాలతో సహా వాటికి అందజేస్తామని తెలిపారు. స్పందించకపోతే ప్రజాక్షేత్రంలో బీజేపీని ఎండగడతామని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని బీజేపీ కాపాడుతోందని చెప్పాల్సి వస్తుందన్నారు. సుప్రీం తీర్పును ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఫైర్ అయ్యారు. ఆర్థిక దోపిడీ, పర్యావరణంపై దాడి విషయంపై ప్రధాని మోదీ స్పందించాలన్నారు. స్పందించకపోతే మోదీకి పాపంలో వాటా ఉందని భావించాల్సి వస్తుందన్నారు. చిత్తశుద్ధి ఉంటే రేవంత్ బయటకు రావాలన్నారు. ఫార్ములా ఈరేసులో మంత్రిగా విధాన నిర్ణయాలు తీసుకున్నా అని చెప్పా.. అధికారులను బలి చేయలేదన్నారు. ఫార్ములా ఈ రేసులో అభ్యంతరం ఉంటే తాను బాధ్యత తీసుకుంటానని కేటీఆర్ తెలిపారు.