First Bird Flu Case Death in AP: రాష్ట్రంలో తొలి కేసు.. బర్డ్ ఫ్లూతో చిన్నారి మృతి

First Bird Flu Case in AP, Two Years Old girl Death: ఏపీలో తొలి బర్డ్ ఫ్లూ మరణం నమోదైంది. ఓ రెండేళ్ల చిన్నారి పచ్చి కోడి మాంసం తిన్నందున బర్డ్ ఫ్లూ సోకి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ ఇంట్లో కోడిని కోసే సమయంలో చిన్నారి చికెన్ కావాలని అడగడంతో ఒక చిన్న ముక్క ఇవ్వగా.. ఆ పాప తిన్న తర్వాత జబ్బు పడిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
అనారోగ్యానికి గురైన చిన్నారిని చికిత్స నిమిత్తం మంగళగిరిలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అంతకుముందు చిన్నారికి జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు కారడం, మూర్ఛ, విరేచనాలు, ఆహారం తినకపోవడంతో ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు వైద్యులకు చిన్నారి కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆ చిన్నారికి గొంతుతో పాటు ముక్కు నుంచి స్వామ్ నమూనాలను సేకరించి ఎయిమ్స్‌లోని వీఆర్‌డీఎల్‌లో పరీక్షలు నిర్వహించారు. టెస్ట్ రిపోర్ట్‌లు అనుమానంగా ఉండడంతో ఐసీఎంఆర్ అప్రమత్తమైంది. వెంటనే స్వాబ్ నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యట్ ఆఫ్ వైరాలజీకి పంపించింది. ఎన్‌ఐవీలో పరీక్షలు జరపగా.. హెచ్5ఎన్1 వైరస్‌గా తేలింది. అయితే ఆ చిన్నారికి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది.
ఇదిలా ఉండగా, ఆ చిన్నారి ఎక్కువగా జంతువులతో ఆడుకునేదన్నారు. పెంపుడు కుక్కలతో పాటు వీధి కుక్కలతో ఆడుకునేదని, పచ్చి చికెన్ ముక్క తిన్న రెండు రోజుల తర్వాత జ్వరం వచ్చినట్లు చిన్నారి తల్లి తెలిపింది. అయితే జిల్లాలో ఎక్కడా కూడా బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి లేదని పశుసంవర్ధక శాఖ అధికారులు వెల్లడించారు. కానీ బాధిత కుటుంబ సభ్యులు నివసించే ఇంటికి సమీపంలో చికెన్ దుకాణం ఉన్నట్లు గుర్తించారు. అయితే ఎవరికీ దీనికి సంబంధించిన లక్షణాలు లేవని అధికారులు చెబుతున్నారు.