TG Assembly: అసెంబ్లీలో రుణమాఫీపై రగడ.. నిరసన చేపట్టిన బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు

BRS MLA’s Protest at Telangana Legislative Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎనిమిదో రోజు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు పురపాలక సంక్షేమ, పరిశ్రమలు, ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి పద్దులపై చర్చ జరిగింది. అదే విధంగా పురపాలక, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లులపై సైతం చర్చ జరగనుంది. అయితే రుణమాఫీ విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని బీఆర్ఎస్ నినాదాలు చేశారు.
కాగా, శాసనసభకు ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వచ్చారు. దీంతో సభకు రావొద్దని జగదీశ్ రెడ్డికి చీఫ్ మార్షల్ సూచించారు. తనను రావొద్దని సభాపతి ఇచ్చిన బులెటిన్ చూపించాలని జగదీశ్ రెడ్డి కోరారు. ఇదిలా ఉండగా, అసెంబ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన చేపట్టారు. అంతకుముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని కోరారు.
ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులు నల్ల బ్యాడ్జీలు, ప్లకార్డులతో అసెంబ్లీలోకి వెళ్లారు. రుణమాఫీపై రేవంత్ పాపం.. తెలంగాణకు రైతన్నకు శాపమని నినాదాలు చేశారు. రుణమాఫీ ఆశలు వమ్ము.. రైతన్న కంటిలో దుమ్ము అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులకు పూర్తి రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
రూ.2లక్షల రుణమాఫీ పూర్తి చేయాలని, రుణమాఫీ బూటకం కాంగ్రెస్ నాటకం అంటూ నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి వెళ్లారు. దీంతో ఒక్కసారిగా అసెంబ్లీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అలాగే, వడగండ్ల వానతో పంట నష్టం జరిగిందంటూ బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. ఈ మేరకు బీజేపీ నాయకులు విరిగిన మొక్కజొన్న కంకులు రాలిపడిన మామిడికాయలను తీసుకొచ్చి నిరసన తెలిపారు.
అయితే, అసెంబ్లీలకు ఎలాంటి వస్తువులను తీసుకురావొద్దంటూ మార్షల్స్ అడ్డుకున్నారు. అలాగే మీడియా పాయింట్ వద్ద కూడా ఎలాంటి నిరసన వస్తువులు తీసుకురావొద్దని చెప్పారు. అనంతరం రాష్ట్ర రైతులను ఆదుకునే విధంగా ఫసల్ బీమా యోజన అమలు చేయడంతో పాటు పంట నష్ట అంచనా వేసి వారికి నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.