Kakani Govardhan Reddy : పరారీలో కాకాణి.. లుకౌట్ నోటీసులు జారీ

Kakani Govardhan Reddy : పరారీలో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాకాణి దేశం విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. అన్ని విమానాశ్రయాలు, సీపోర్టులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. మరోవైపు పోలీసులు అతడికి మూడుసార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాలేదు. 12 రోజులుగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వీరి జాడ కోసం ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో ఆరు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్, బెంగళూరు, చైన్నై ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నాయి.
క్వార్జ్ అక్రమ తవ్వకాలపై ఆరా..
క్వార్జ్ అక్రమ తవ్వకాలు, భారీ ఎత్తున పేలుడు పదార్థాల వినియోగంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాకాణిపై ఇప్పటికే క్వార్జ్ అక్రమ తరలింపు, అట్రాసిటీ, పోలీసులకు దూషించిన కేసులను నమోదు చేశారు. తన అనుచరులతో కలిసి విదేశాలకు కలిసి రూ.250కోట్లకుపైగా విలువ చేసే క్వార్జ్ ఎగుమతి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సందర్భంగా విదేశాల నుంచి పెద్దమొత్తాల్లో నగదు బదిలీపై పూర్తిస్థాయిలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పేలుడు పదార్థాలు సరఫరా చేసిన ఫ్యాక్టరీలు, పేలుడు పదార్థాలు కొన్న వ్యక్తులు, వినియోగంపై దర్యాప్తు చేస్తున్నారు.