Last Updated:

Vallabhaneni Vamsi: పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని.. అరెస్ట్ అందుకేనా?

Vallabhaneni Vamsi: పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని.. అరెస్ట్ అందుకేనా?

Police Arrested Former MLA Vallabhaneni Vamsi in Hyderabad: గన్నవరం మాజీ ఎమ్మెల్యే , వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఆయనను విజయవాడ పటమట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వంశీని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. కిడ్నాప్‌తో పాటు పలువురిపై దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆయనపై బీఎన్ఎస్ సెక్షన్లు 140(1). 308, 351(3), రెడ్ విత్ 3(5) కింద కేసులు నమోదు చేసినట్లు విజయవాడ పటమట పోలీసులు ఆయన ఇంటికి నోటీసులు అంటించినట్లు తెలిపారు.

అయితే, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్‌లో విజయవాడ పోలీసులు అరెస్ట్‌ చేయడంపై వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. ఆయనను కావాలనే అక్రమ కేసులో అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వంశీకి ముందస్తు బెయిల్ ఉందని ఆ పార్టీ గుర్తు చేసింది. అలాగే ఆ దాడిపై ఫిర్యాదును ఇటీవల సత్యవర్ధన్ వెనక్కి తీసుకున్నారని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. కావాలనే కూటమి ప్రభుత్వం వంశీని టార్గెట్ చేయడంతో పాటు మరో అక్రమ కేసు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించింది.

ఇదిలా ఉండగా, వైసీపీ హయాంలో వల్లభనేని వంశీ గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి చేశాడని ఆ పార్టీ కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కేసు పెట్టారు. విచారణ జరుగుతుండగా ఇటీవల కేసు విత్ డ్రా చేసుకొని తనను బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వంశీ కిడ్నాప్ చేసి బెదిరించడంతో సత్యవర్ధన్.. ఆ కేసును విత్ డ్రా చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసులోనే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.