Supreme Court : ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌కు చుక్కెదురు.. సుప్రీం కోర్టు నోటీసులు

Supreme Court : గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌గా పనిచేసిన సంజయ్ అవినీతి పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర సర్కారు ఆదేశాల మేరకు సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏ1గా సంజయ్, ఏ2గా సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్‌ఫ్రా, ఏ3గా క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ సంస్థ అధినేతలపై ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. దీంతో సంజయ్ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. సంజయ్‌కి బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ అమానుతుల్లా, జస్టిస్ పీకే మిశ్రా ద్విసభ్య ధర్మాసనం ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాది సంజయ్‌కి ఇవాళ నోటీసులు జారీ చేసింది.
అధికార దుర్వినియోగం..
అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు సంజయ్‌పై ఆరోపణలు ఉన్నాయి. ట్యాబ్‌ల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని, అగ్ని మొబైల్ యాప్‌ను తనకు తెలిసిన సంస్థకు కట్టబెట్టారని అభియోగాలు నమోదయ్యాయి. నిబంధనల ఉల్లంఘన, క్రమశిక్షణ రాహిత్యంపై వివరణ ఇవ్వాలని డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ జారీ చేస్తూ సీఎస్ విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. అభియోగాలపై నెలలోగా వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సంజయ్ అధికార దుర్వినియోగంపై విచారణ చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. రాజకీయ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించింది. వేర్వేరు అభియోగాలపై సంజయ్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.