Beggers: ఎక్కడికెళ్లిన పాక్ బిచ్చగాళ్లే.. వెళ్లగొడుతున్న దేశాలు

Pakistan: పాకిస్తాన్ పరిస్థితి చూస్తుంటే యథా రాజా.. తథా ప్రజా అన్నట్టుగా కనిపిస్తోంది. దేశాన్ని నడిపించుకునేందుకు డబ్బులు లేక ప్రపంచ దేశాల ముందు ఆ దేశ నేతలు అడుక్కుంటుంటే.. తామేం తక్కువ తినలేదన్నట్టు ప్రజలు కూడా పలు దేశాల్లో అడుక్కుంటున్నారు. పాకిస్తాన్ మిత్రదేశాల్లో ఎక్కడికెళ్లినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఆయా దేశాలు పాకిస్తాన్ బిచ్చగాళ్లను తట్టుకోలేక వారిని తిరిగి స్వదేశానికి పంపిస్తున్నాయి. చివరికి ఆ దేశం పరిస్థితి బిచ్చగాళ్లను ఎగుమతి చేసే దేశంలాగా తయారైంది.
తాజాగా సౌదీ అరేబియా తమ దేశంలో ఉన్న పాకిస్తానీ బిచ్చగాళ్లను స్వదేశానికి పంపుతోంది. ఇప్పటివరకు ఏకంగా 5033 మందిని బలవంతంగా వెళ్లగొట్టిందని సమాచారం. టారిస్ట్ వీసా తీసుకుని మరీ పాకిస్తాన్ దేశస్తులు విదేశాల్లో బిచ్చమెత్తుకుంటున్నారట. దీంతో సౌదీ పాటించిన మార్గాన్నే ఇతర దేశాలు పాటిస్తున్నాయట. ఆయా దేశాలు కూడా 369 మంది పాకిస్తాన్ బిచ్చగాళ్లను స్వదేశానికి పంపాయట. ఈ విషయాన్ని పాకిస్తాన్ మంత్రి మొహసిన్ నక్వీ ఇటీవల ఆ దేశపు నేషనల్ అసెంబ్లీలో వెల్లడించినట్టు అక్కడి పత్రికలు కథనాలు ఇచ్చాయి.
అయితే 2024 జనవరి నుంచి మిత్రదేశాలు పంపిన బిచ్చగాళ్ల సంఖ్య 5402 అని పాకిస్తాన్ పేర్కొంది. ఇందులో సౌదీ అరేబియాతో పాటు ఇరాక్, మలేసియా, ఒమన్, ఖతార్, యూఏఈ ఉన్నాయి. దీంతో పాకిస్తాన్ లో బిచ్చగాళ్ల వ్యవహారం పెద్ద సమస్యగా మారిందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసీఫ్ సియాల్ కోట్ లో జరిగిన కార్యక్రమంలో అన్నారు. దేశంలో 2 కోట్ల మంది బిచ్చగాళ్లు ఉన్నారని వారి నెలవారీ ఆదాయం 4200 కోట్ల పాకిస్తాన్ రూపాయలుగా తెలిపారు. కాగా పాకిస్తాన్ నుంచి టూరిస్ట్ వీసాలు తీసుకుని వీరంతా విదేశాల్లో బిచ్చగాళ్ల అవతారం ఎత్తుతున్నారని తెలుస్తోంది. విదేశాల్లో అరెస్ట్ అవుతున్న బిచ్చగాళ్లలో 90 శాతం మంది పాకిస్తాన్ వాళ్లేనని సమాచారం.