Published On:

Trump vs Musk: ట్రంప్‌తో విడాకులు చాలా కాస్ట్లీ గురూ.. బిలియన్‌ల కొద్ది డాలర్ల నష్టపోయిన ఇన్వెస్టర్లు

Trump vs Musk: ట్రంప్‌తో విడాకులు చాలా కాస్ట్లీ గురూ.. బిలియన్‌ల కొద్ది డాలర్ల నష్టపోయిన ఇన్వెస్టర్లు

Trump and Musk Issue effect to Shares: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్‌ మస్క్‌కు.. అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌కు మధ్య జరుగుతున్న వివాదం తెలిసిందే. ట్రంప్‌ ఎన్నికల్లో గెలడానికి ఎంతో కృషి చేయడమే కాకుండా … ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్‌ పార్టీకి 250 మిలియన్‌ డాలర్ల విరాళం కూడా ఇచ్చి ఆదుకున్నాడు. గెలిచిన తర్వాత ట్రంప్‌ మస్క్‌ రుణం ఉంచుకోలేదు. ఆయనకు ఒక మంత్రి పదవి కట్ట బెట్టాడు.

 

ప్రభుత్వంలో అనవసరపు వ్యయం తగ్గించే బాధ్యతను అప్పగించాడు. దీంతో మస్క్‌ లక్షలాది ప్రభుత్వ ఉద్యోగులను తీసేయడంతో పెద్ద వివాదమే రేగింది. ఉద్యోగులు మస్క్‌కు వ్యతిరేకంగా ఆయన వ్యాపారాలపై పడ్డారు. టెస్లా కార్లు కొనుగోలు చేయవద్దని కార్లను, షోరూం లను ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. దాని ప్రభావం తన వ్యాపారాలపై పడుతుందని భావించి తన పదవికి రాజీనామా చేశాడు మస్క్‌. అప్పటి నుంచి ఇరువురి మధ్య సంబంధాలు పూర్తిగా దిగజారిపోయాయి. దాని ప్రభావం ప్రస్తుతం మస్క్‌ వ్యాపారాలపై పడింది.

 

అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్ట్‌ ట్రంప్‌నకు… టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌కు మధ్య హానీమూన్‌ ముగిసింది. కాగా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కాస్తా టెస్లా షేర్లపై పడింది.  ఒక్కరోజే టెస్లా షేరు 14 శాతం క్షీణించి మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఏకంగా 150 బిలియన్‌ డాలర్లు నష్టపోయింది. ఇండియన్‌ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే కంపెనీ విలువ సుమారు 13 లక్షల కోట్లు హారతి కర్పూరం అయ్యింది. ఇక ట్రంప్‌ విషయానికి వస్తే ముందే ఆవేశపరుడు. ప్రభుత్వం మస్క్‌కు ఇస్తున్న కాంట్రాక్టులను పూర్తిగా రద్దు చేయాలని ఆదేశించాడు.

 

అలాగే టెస్లా కార్లకు ప్రభుత్వం ఇస్తున్న బిలియన్‌ల కొద్ది డాలర్ల పన్నుల రూపంలో ఇస్తున్న రాయితీలను ఉపసంహరించాలని ఆదేశించాడు. టెస్లా కార్లు కొంటే కస్టమర్‌కు 7,500 డాలర్ల రాయితీని ప్రభుత్వమే భరిస్తుంది. దీంతో కంపెనీ తన అమ్మకాలను పెంచుకోగలుగుతోంది. మరి ఇద్దరు దిగ్గజాల మధ్య పోరు ఎంత వరకు పోతుందో అని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.