Lalu Prasad Yadav: ఆర్జేడీ జాతీయ అధ్యక్షుడిగా లాలూ ప్రసాద్ యాదవ్.. వరుసగా 13వ సారి ఏకగ్రీవం

Lalu Prasad Yadav national President RJD: ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి పార్టీ జాతీయాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వరుసగా 13వ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్నాలోని ఆర్జేడీ కార్యాలయంలో తేజస్వీ యాదవ్, రబ్రీదేవి, మీసా భారతి, సీనియర్ నాయకుల సమక్షంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. వేరే అభ్యర్థులు పోటీ చేయకపోవడంతో లాలూ ఎన్నిక ఖాయమైంది. ఈ సందర్భంగా తేజస్వీ యాదవ్ మాట్లాడారు. లాలూ నాయకత్వం పార్టీకి బలమన్నారు. త్వరలో జరుగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తంచేశారు. జులై 5న ‘లాలూ సమ్మాన్ దివస్’ జరుపుకోనున్నారు.
1997లో ఆర్జేడీ స్థాపించినప్పటి నుంచి పార్టీకి లాలూ నాయకత్వం వహిస్తున్నారు. బీహార్‌లో ఓబీసీలు, దళితులు, ముస్లింల మద్దతుతో ఆర్జేడీ బలమైన ప్రతిపక్షంగా ఉంది. 78 ఏళ్ల లాలూ ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ తన నాయకత్వం కొనసాగిన్నారు. తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీహార్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లాలూ పునఃనియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.
లాలూ ప్రసాద్ బుధవారం తన 78వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకొనున్నారు. పాట్నాలోని తన నివాసంలో 78 కిలోల లడ్డూ కేక్‌ను కట్ చేశారు. అనుచరులు, పార్టీ నేతలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ‘లాలూ యాదవ్ జిందాబాద్’ అని నినాదాలు చేశారు. ఈ వయసులో ఆయన మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టడం విశేషం.