Published On:

Zambian President Edgar Lungu: 20 రోజులుగా నిలిచిన జాంబియా మాజీ అధ్యక్షుడి అంత్యక్రియలు!

Zambian President Edgar Lungu: 20 రోజులుగా నిలిచిన జాంబియా మాజీ అధ్యక్షుడి అంత్యక్రియలు!

Former Zambian President Edgar Lungu Final Rituals: ఆఫ్రికా దేశం జాంబియా మాజీ ప్రెసిడెంట్ ఎడ్గర్‌ లుంగూ (68) ఇటీవల మృతిచెందారు. అంత్యక్రియలపై 20 రోజులుగా సందిగ్ధత కొనసాగుతోంది. అధికారికంగా నిర్వహిస్తామని జాంబియా ప్రభుత్వం ఓవైపు.. దక్షిణాఫ్రికాలో ప్రైవేట్‌గా నిర్వహించుకుంటామని కుటుంబ సభ్యులు మరోవైపు వాదిస్తున్నారు. ఈ క్రమంలో అంత్యక్రియలు రెండుసార్లు వాయిదా పడ్డాయి. అంత్యక్రియ వివాదం కోర్టుకు చేరింది. తుది నిర్ణయం వచ్చే వరకు అంత్యక్రియలు నిర్వహించొద్దని కోర్టు తాత్కాలిక ఆదేశాలు ఇవ్వడంతో మరోసారి నిలిచిపోయాయి.

 

పేట్రియాటిక్‌ ఫ్రంట్‌ నేత లుంగూ 2015-21 మధ్యలో జాంబియా అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటీవల అనారోగ్యానికి గురికాగా, ఈ నెల 5వ తేదీన దక్షిణాఫ్రికాలోని ఓ ఆసుపత్రిలో మృతిచెందారు. అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలనే విషయంపై వివాదం నెలకొంది. తన అంత్యక్రియలకు ప్రస్తుత అధ్యక్షుడు హిచిలేమా హాజరు కాకూడదని లుంగూ గతంలో స్పష్టంగా చెప్పినట్లు ఆయన కుటుంబ సభ్యులు పేర్నొన్నారు. అంత్యక్రియలను దక్షిణాఫ్రికాలో నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం జోహన్నెస్‌బర్గ్‌ ఓ ప్రైవేట్ శ్మశాన వాటికలో ఏర్పాట్లు చేశారు. లుంగూకి చెందిన పార్టీ నేతలు ఇక్కడకు చేరుకున్నారు.

 

అంత్యక్రియలకు గంట ముందు.. 

లుంగూ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహిస్తామని, అధ్యక్షుడు హిచిలేమా సారథ్యంలో కొనసాగుతాయని జాంబియా ప్రభుత్వం చెబుతోంది. తాజాగా బుధవారం అంత్యక్రియలు మొదలయ్యే గంట ముందు నిలిపివేయాలని కోరుతూ దక్షిణాఫ్రికా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. మాజీ అధ్యక్షుడి అంత్యక్రియలు జాంబియా చట్ట ప్రకారం ప్రభుత్వ లాంఛనాలతో జరగాల్సి ఉందని తెలిపింది. గతంలో చనిపోయిన అధ్యక్షులను ఖననం చేసిన శ్మశానవాటికలో లుంగూ కోసం సమాధిని సిద్ధం చేశామని తెలిపింది. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉందని పేర్కొంది. రెండువర్గాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణ ఆగస్టుకు వాయిదా వేసింది. ఆలోగా ఇరువర్గాలు ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

 

సుదీర్ఘకాలం రాజకీయ వైరం..

పేట్రియాటిక్‌ ఫ్రంట్‌ నేత లుంగూ, యునైటెడ్‌ పార్టీ ఫర్‌ నేషనల్‌ డవలప్‌మెంట్‌ నేత హకైండే హిచిలేమా మధ్య చాలా కాలంగా వైరం కొనసాగుతోంది. 2016 అధ్యక్ష ఎన్నికల్లో హిచిలేమాను ఓడించిన లుంగూ పాలనా పగ్గాలు చేపట్టారు. అనంతరం అధ్యక్షుడి కాన్వాయ్‌కు దారి ఇవ్వలేదన్న అభియోగాలపై నమోదైన కేసులో హిచిలేమా 4 నెలలు జైలుకు వెళ్లారు. దీంతో అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆయనపై అభియోగాలను ఉపసంహరించుకోవడంతో హిచిలేమా జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం 2021 ఎన్నికల్లో లుంగూను ఓడించి హిచిలేమా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

 

ఇవి కూడా చదవండి: