Operation Brahma: భూకంప తీవ్రతకు మయన్మార్ అతలాకుతలం.. ఆపరేషన్ బ్రహ్మతో భారత్ మరింత సాయం

Operation Brahma,India sends more humanitarian aid in C-17 aircraft: వరుసగా చోటుచేసుకుంటున్న భూకంపాలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. పలు దేశాల్లో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల భూకంప తీవ్రతకు మయన్మార్ అతలాకుతలమైంది. ఈ భూకంప ధాటికి దాదాపు 3వేలకు పైగా మృతి చెందగా.. 5 వేల వరకు గాయపడ్డారు. మయన్మార్‌లో నిమిషాల వ్యవధిలోనే వరుసగా 7.7, 6.3 తీవ్రతతో భూమి కంపించడంతో రోడ్లు, వంతెనలు, ఇళ్లు పెద్ద సంఖ్యలో దెబ్బతిన్నాయి.
ప్రధానంగా మాండలే, నేపిడిలో భూకంప తీవ్రతకు పరిస్థితులు దారుణంగా మారాయి. భారీగా నష్టపోయిన మయన్మార్‌కు భారత్ సహాయం అందిస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ బ్రహ్మ పేరు మీద సీ 130జే విమానం ద్వారా 16 టన్నుల సామగ్రితో ఢిల్లీ నుంచి మాండలేకు బయలుదేరింది. అలాగే ఐఎన్ఎస్ ఘరియాల్ ఓడ విశాఖ నుంచి 442 మెట్రిక్ టన్నుల సామగ్రితో మాండలేకు పంపించారు. దీంతో పాటు మాండలేలో సహాయక చర్యల కోసం ఇండియన్ ఆర్మీ ఫీల్డ్ ఆస్పత్రి యూనిట్ ప్రారంభించారు.
తాజాగా, భారత్ మరో నిర్ణయం తీసుకుంది. మయన్మార్ దేశానికి మరింత సాయం అందిస్తుంది. ఇందులో భాగంగానే సీ17 గ్లోబ్ మాస్టర్ విమానంలో 31 టన్నుల సామగ్రిని హిండన్ ఎయిర్ పోర్స్ నుంచి మయన్మార్ దేశానికి బయలుదేరింది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఎక్స్ వేదికగా తెలిపారు.