Xi Jinping : భారత్- చైనా సంబంధాలకు 75 ఏళ్లు

Xi Jinping : భారత్, చైనా దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాలు కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. తాజాగా భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో పరస్పర అభినందన సందేశాలు ఇచ్చిపుచ్చుకున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ఏనుగు, డ్రాగన్‌లా అభివృద్ధి చెందాలన్నారు. 2020లో తూర్పు లద్దాఖ్‌లో సైనికుల మధ్య తీవ్ర ఘర్షణతో రెండు దేశాల మధ్య స్తంభించిన సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషం.
సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని కాపాడుతాం..
పొరుగు దేశాలు శాంతియుతంగా ఉండేందుకు మార్గాలను అన్వేషించాలని జిన్‌పింగ్ అన్నారు. కీలకమైన అంతర్జాతీయ వ్యవహారాల్లో సంప్రదింపులు, సమన్వయాన్ని మరింతగా పెంచుకొనేందుకు సహకారం అందిపుచ్చుకోవాలని నిర్ణయించారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని సంయుక్తంగా కాపాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
ప్రధాని, రాష్ట్రపతికి అభినందన సందేశాలు..
మరోవైపు ఇండియా, చైనా మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి నేటికీ 75 ఏళ్లు అని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్ అన్నారు. చైనా అధ్యక్షుడు, ప్రధాని.. భారత రాష్ట్రపతి, ప్రధానిలతో అభినందన సందేశాలు ఇచ్చిపుచ్చుకున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇరు దేశాలు పురాతన నాగరికతలు కలిగి ఉన్నాయని చెప్పారు. ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు అన్నారు. గ్లోబల్ సౌత్‌లో ముఖ్యమైన సభ్యులు రెండు దేశాలు ఆధునికీకరణలో కీలక దశలో ఉన్నాయని పేర్కొన్నారు.