Iran Attacks on Israel: ఇరాన్- ఇజ్రాయెల్ వార్.. బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ దాడులు!

Iran Attacks on Israel with Ballistic Missiles: ఇజ్రాయెల్ పై ఇరాన్ వరుస దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ బలగాలకు ఊపిరి ఆడనీయకుండా చేస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ పై అత్యాధునిక క్షిపణిని ఇరాన్ ప్రయోగించింది. ఈ సరికొత్త బాలిస్టిక్ క్షిపణి రేంజ్ దాదాపు పన్నెండు వందల కిలోమీటర్లు అని ఇరాన్ మిలటరీ సీనియర్ అధికారులు ప్రకటించారు.
దెబ్బకు దెబ్బ అనే సూత్రాన్ని ఇరాన్ పాటిస్తోంది. తొలిరోజు ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ కాచుకుంది. ఆ తరువాత రెండో రోజు డిఫెన్ నుంచి అఫెన్స్ లోకి మళ్లింది ఇరాన్ దేశం. ఇజ్రాయెల్ కు ఊపిరి తీసుకునే టైమ్ కూడా ఇవ్వకుండా వరుస దాడులతో ఇరాన్ బెంబేలెత్తిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ పైకి ఒక సరికొత్త బాలిస్టిక్ క్షిపణిని ఇరాన్ ప్రయోగించింది. ఈ సరికొత్త క్షిపణి అత్యంత శక్తివంతమైనది. అంతేకాదు ఈ సరికొత్త బాలిస్టిక్ క్షిపణి రేంజ్ దాదాపు పన్నెండు వందల కిలోమీటర్లు అని ఇరాన్ మిలటరీ సీనియర్ అధికారులు ప్రకటించారు. ఇది అమెరికా థాడ్, పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థలను కూడా ఛేదించగలదన్నారు మిలటరీ అధికారులు. అంతేకాదు ఈ క్షిపణికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ క్షిపణి…తన వార్ హెడ్ లను కూడా పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోగలదు. ఈ కారణంతోనే ఎయర్ డిఫెన్స్ వ్యవస్థలను కూడా ఛేదించగలదన్నారు. అయితే ఈ సరికొత్త క్షిపణి చేసిన నష్టం గురించిన వివరాలు తెలియరాలేదు.
ఇదిలా ఉంటే.. ఇరాన్ దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. అంతేకాదు ఇజ్రాయెల్ దాడుల వెనుక అమెరికా ఉందని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయెతుల్లా ఖమేనీ చేసిన ఆరోపణలు అర్థరహితమన్నారు ట్రంప్. అమెరికా పై దాడులు చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తే..తీవ్ర పరిణామాలుంటాయని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ దాడులను ఎలాగైనా తిప్పికొడతామన్నారు. అంతేకాదు ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య దాడులు ఆపడం తనకు చాలా సులభమని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
అయితే వరుస దాడుల పేరుతో ఇరాన్ ఇలాగే కాలయాపన చేస్తే చివరకు ఆ దేశానికే నష్టం జరుగుతుందని డొనాల్డ్ ట్రంప్ జోస్యం చెప్పారు. ఇప్పటికైనా అమెరికాతో తాజాగా అణు ఒప్పందాన్ని చేసుకోవడానికి ఇరాన్ ముందుకు రావాలని ట్రంప్ కోరారు. తాను ఇరాన్ మేలు కోరే ఈ విషయం చెబుతున్నానని ట్రంప్ అన్నారు. ఈ మారణహోమం ఇలాగే కొనసాగితే..చివరకు ఇరాన్ కు ఏమీ మిగలదని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ కు ఒకప్పుడు ఇరానియన్ సామ్రాజ్యంగా ఎంతో పేరు ఉండేదని ట్రంప్ గుర్తు చేశారు. అటువంటి ఘనత వహించిన ఇరానియన్ సామ్రాజ్యాన్ని పరిరక్షించుకోవడానికి ప్రస్తుత ఇరాన్ పాలకులు చొరవ చూపాల్సిన అవసరం ఉందన్నారు ట్రంప్.
కాగా ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య ఘర్షణలు ప్రారంభమైన తరువాత అనేక పరిణామాలు సంభవించాయి. కాగా అణు ఒప్పందం చేసుకోవడానికి రావాలని ఇరాన్ ను డొనాల్డ్ ట్రంప్ కోరడం ఇది రెండోసారి. అయితే అణు ఒప్పందం కోసం చర్చలకు రావాలన్న ట్రంప్ ప్రతిపాదనను ఇరాన్ తోసిపుచ్చింది. ఒకవైపు దాడులు, ప్రతిదాడులు జరుగుతుంటే మరో వైపు అణు ఒప్పందం కోసం చర్చలు జరపడం అర్థ రహితమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పేర్కొన్నారు. అంతేకాదు ట్రంప్ ప్రతిపాదిస్తున్న అణు ఒప్పందం మౌలికంగా ఇరాన్ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉందని అబ్బాస్ అరాగ్చీ మండిపడ్డారు. అణు ఒప్పందం పేరుతో ఇరాన్ సార్వభౌమాధికారాన్నే అగ్రరాజ్యమైన అమెరికా ప్రశ్నిస్తోందని అబ్బాస్ అరాగ్చీ దుయ్యబట్టారు.
కాగా కొంతకాలంగా అమెరికా – ఇరాన్ మధ్య అణు ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. ఒమన్ ..ఈ చర్చల కార్యక్రమానికి మధ్యవర్తిత్వం వహిస్తోంది. ఇప్పటివరకు ఐదు విడతలుగా రెండు దేశాల మధ్య చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చలు ఫలప్రదం కాలేదు. కాగా తాజాగా 15వ తేదీన జరగాల్సిన ఆరో దఫా చర్చలను రద్దు చేశారు.
ఏమైనా సరికొత్త బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్ బలగాలకు చుక్కలు చూపిస్తోంది ఇరాన్ .