Published On:

Iran – Israel War Updates: దద్దరిల్లిన టెల్ అవీవ్.. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ను బ్రేక్ చేసిన ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి!

Iran – Israel War Updates: దద్దరిల్లిన టెల్ అవీవ్.. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ను బ్రేక్ చేసిన ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి!

Iran Ballistic missiles Breaks the Israel Iron Dome: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. అత్యంత శక్తివంతమైన డ్రోన్లు, క్షిపణులతో పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. కాగా ఇరాన్ చేసిన ప్రతీకార దాడులకు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ దద్దరిల్లిపోయింది. ప్రధానంగా ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ అయిన ఐరన్ డోమ్ ను ఇరాన్ దాడులు దెబ్బతీశాయి.

 

ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ .. ఇదొక అధునాత రక్షణ వ్యవస్థ. ఐరన్ డోమ్ గురించి ఇజ్రాయెల్ గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది. నిజానికి ఇజ్రాయెల్ ఆర్మీకి ఐరన్ డోమ్ ఒక ప్లస్ పాయింట్. ప్రత్యర్థి దేశాలు ప్రయోగించే డ్రోన్లు, క్షిపణులను దూరం నుంచే అడ్డుకోగల సామర్థ్యం ఈ ఐరన్ డోమ్ కు ఉంటుంది. ఇంత సామర్థ్యం ఈ ఐరన్ డోమ్, ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు దాడికి నుజ్జు నుజ్జు అయిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల ముందు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తేలిపోయింది.

 

వాస్తవానికి రెండేళ్ల కిందట పాలస్తీనా – ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు ప్రారంభమైనప్పుడు తొలిసారిగా ఐరన్ డోమ్ గురించి అందరికీ తెలిసింది. పాలస్తీనా – ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు చివరకు హమాస్ – ఇజ్రాయెల్ మధ్య దాడులకు దారితీసింది. వాస్తవానికి పాలస్తీనా అనుకూల మిలిటెంట్ సంస్థే.. హమాస్. ఇజ్రాయెల్ ను దెబ్బతీయడానికి హమాస్ చేసిన అనేక క్షిపణి దాడులను అడ్డుకుంది ఐరన్ డోమే. ఆ తరువాత హమాస్ హవా తగ్గింది. తెరపైకి హెజ్ బొల్లా మిలిటెంట్ సంస్థ వచ్చింది. హెజ్ బొల్లా కూడా పాలస్తీనా అనుకూల మిలిటెంట్ సంస్థే. అయితే హెజ్ బొల్లా కార్యక్షేత్రం లెబనాన్. అంతేకాదు హెజ్ బొల్లా మిలిటెంట్ సంస్థకు ఇరాన్ సంపూర్ణ సహకారం ఉంది. ఈ నేపథ్యంలో హెజ్ బొల్లా క్షిపణి దాడుల నుంచి కూడా ఇజ్రాయెల్ ను కాపాడింది.. ఈ ఐరన్ డోమ్ వ్యవస్థ. కాగా తాజా పరిణామాలతో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

 

ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడుల ప్రభావం టెల్ అవీవ్ తోపాటు పరిసర ప్రాంతాలపై కూడా కనిపించింది. టెల్ అవీవ్ నగరం మధ్యలో ఉన్న వివిధ విభాగాల ప్రధాన కార్యాలయాల ప్రాంగణాల్లో కూడా భారీ పేలుళ్లు సంభవించాయి. అంతేకాదు ప్రజలు నివాసం ఉండే అనేక భవనాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాగా టెల్ అవీవ్ నగరంపైకి ఇరాన్ క్షిపణులు దూసుకువస్తున్న సమయంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ అనేకసార్లు సైరన్లు మోగాయి.

 

ఇరాన్ కౌంటర్ అటాక్ కు ఆ దేశంలో మంచి స్పందన వచ్చింది. టెహ్రాన్ లో ప్రజలు రోడ్లమీదకు వచ్చారు. ఆయెతుల్లా ఖమేనీ నాయకత్వంలోని ఇరాన్ ప్రభుత్వానికి మద్దతు పలికారు. అలాగే ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఇరాన్ సైనికాధికారులకు నివాళులు అర్పించారు.

 

ఇదిలాఉంటే.. ఇజ్రాయెల్ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోరాదని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయెతుల్లా ఖమేనీ కోరారు. అమెరికా, యునైటెడ్ కింగ్ డమ్, ఫ్రాన్స్ , జర్మనీ దేశాలు ఇజ్రాయెల్ తరఫున వకాల్తా పుచ్చుకుని జోక్యం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయని ఆయెతుల్లా ఖమేనీ ఆరోపించారు. అదే జరిగితే .. ఆయా దేశాలపై కూడా ఇరాన్ దాడులు చేస్తుందని ఆయెతుల్లా ఖమేనీ హెచ్చరించారు.

 

ఇదిలా ఉంటే ఇరాన్ ప్రతీకర దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. ఇజ్రాయెల్ సైనిక పాటవాన్ని ఇరాన్ సరిగా అంచనా వేయలేకపోతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు తాము చేసిన దాడులు కేవలం ట్రలర్ మాత్రమేనన్నారు. ఇరాన్ కౌంటర్ దాడులను ఆపకపోతే…తాము తీవ్రంగా రియాక్ట్ అవుతామన్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ ను వల్లకాడులా మారుస్తామని నెతన్యాహు హెచ్చరించారు. అంతేకాదు ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తే సహించేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. తాము కేవలం అణు కేంద్రాలను మాత్రమే టార్గెట్ చేసుకున్నామని నెతన్యాహు వివరణ ఇచ్చారు.

మొత్తంమీద ఇజ్రాయెల్ – ఇరాన్ దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది.

 

ఇవి కూడా చదవండి: