Canada : కెనడాలో కార్చిచ్చు.. వేలమంది తరలింపు

Canada : కెనడా పశ్చిమాన సస్కెట్చివాన్ ప్రావిన్స్‌లో భీకర కార్చిచ్చు వ్యాపించడంతో అత్యవసర పరిస్థితి విధించారు. ఇప్పటికే మాంటోబా ప్రావిన్స్‌లో దాదాపు 17వందల మందిని ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తాము ఇప్పటికే తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నామని సస్కట్‌చెవాన్ ప్రావిన్స్ ప్రీమియర్ స్కాట్మో పేర్కొన్నారు. విపత్తును ఎదుర్కోవడానికి అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ప్రావిన్స్ నుంచి ఇప్పటికే 4వేల మందిని తరలించారు. 6,69,000 ఎకరాల్లో కార్చిచ్చు వ్యాపించింది. పరిస్థితి ఏ మాత్రం అనుకూలంగా లేదని, రానురాను సంక్లిష్టంగా మారే అవకాశం ఉందని సిబ్బంది చెబుతున్నారు.
ప్రావిన్స్‌లో అత్యవసర పరిస్థితి విధింపు..
బుధవారం మాంటోబా ప్రావిన్స్‌లో అత్యవసర పరిస్థితిని విధించారు. చిన్నచిన్న గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. ఇటీవల ఎన్నడూ ఈస్థాయి కార్చిచ్చు చూడలేదని అధికారులు చెబుతున్నారు. ప్రజలను తరలించేందుకు కెనడా వైమానిక దళం రంగంలోకి దిగింది. ప్రావిన్స్‌లో 1,73,000 ఎకరాలు కాలి బూడిదయ్యాయి. మూడు రోజలు వర్షం పడితే కార్చిచ్చు అదుపులోకి రాదని భావిస్తున్నారు. ఇక్కడి నుంచి వస్తున్న పొగ అమెరికాలోని మిన్నెసోటా, మిషిగాన్ తదితర రాష్ట్రాల వైపు వెళుతోంది. రెండు ప్రావిన్స్‌ల్లో 2025 ఏడాదిలో 15 లక్షల ఎకరాలు దగ్ధమయ్యాయి.
కెనడా సహజ వనరుల విభాగం లెక్కల ప్రకారం.. 6వేల కార్చిచ్చులు కలిపి 3.7 కోట్ల ఎకరాలను కాల్చివేసినట్లు తెలుస్తోంది. కెనడా కార్చిచ్చుల వల్లే అగ్రరాజ్యం అమెరికాలోని ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులు పడుతున్నారు. ది అమెరికన్ లంగ్ అసోసియేషన్ 2025లో ఇచ్చిన స్టేట్ ఆఫ్ ది ఎయిర్ రిపోర్టు పేర్కొంది.