Published On:

Centre Orders OTT Platforms: కొనసాగుతున్న ఆపరేషన్ సిందూర్- పాక్‌ ఓటీటీ కంటెంట్‌పై భారత్ కీలక నిర్ణయం

Centre Orders OTT Platforms: కొనసాగుతున్న ఆపరేషన్ సిందూర్- పాక్‌ ఓటీటీ కంటెంట్‌పై భారత్ కీలక నిర్ణయం

OTT Platforms to Remove All Pakistan Origin Content: పహల్గామ్‌ ఉగ్రదాడిని భారత ప్రభుత్వం తిప్పికొడుతుంది. దాయాది దేశం పాకిస్తాన్‌పై అన్ని విధాలుగా చర్యలకు దిగింది. ముందు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసి షాకిచ్చింది. ఆ తర్వాత పాకిస్తాన్‌ పౌరులను తిరిగి వెనక్కి పంపింది. ఇక తాజాగా ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో ఉగ్రదాడిని తిప్పికొట్టింది. ఉగ్రవాదులకు సంబంధించిన 9 స్థావరాలను లక్ష్యంగా భారత రక్షణ దళాలు దాడికి దిగాయి.

 

ఇప్పటికే ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగుతూనే ఉందని తాజాగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు. ఈ క్రమంలో పాకిస్తాన్‌పై ముప్పేట దాడి చేసేందుకు భారత ప్రభుత్వం ఏ అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. ఇందులో భాగంగా వినోద రంగంపై కూడా భారత్‌ తాజాగా చర్యలకు ఉపక్రమించింది. కరోనా తర్వాత ఓటీటీ వల్ల ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. చలన చిత్ర రంగాన్ని ఓటీటీలు శాసిస్తున్నాయనడంలో సందేహం లేదు. ఇవి వచ్చాక భాషా సరిహద్దులను కూడా చెరిగిపోయాయి.

 

విదేశీ భాషలకు సంబంధించిన సినిమాలు, ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్లాట్‌ఫామ్స్‌ కూడా వచ్చాయి. ప్రస్తుతం భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పాక్‌ మూలాలు ఉన్న ఓటీటీ కంటెంట్‌ను పూర్తిగా నిలిపివేయాలని భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఓ టీటీ ప్లాట్‌ఫాంలకు సూచనలు జారీ చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ‘జాతీయ భద్రత దృష్ట్యా పాకిస్తాన్‌ మూలాలు ఉన్న ఓటీటీ వేదికలు, కంటెంట్‌, సినిమాలు, స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫాంలు, మధ్యవర్తిత్వం ద్వారా అయ్యే ఏ ప్రసారమైనా ఇక పూర్తిగా నిలిపివేస్తున్నాం.

 

ఇకపై పాకిస్థాన్‌ వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు, పాటలు, పాడ్‌కాస్ట్‌లు సహా మీడియా కంటెంట్‌ ఏది ఇక భారత్‌లో అందుబాటులో ఉండవు. సబ్‌స్క్రీప్షన్‌ సహా ఇతర మార్గాల ద్వారా కంటెంట్‌ పొందుతున్న వారికి ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేసింది. ఓటీటీ వేదికలు పాకిస్తాన్ కంటెంట్‌ను భారత్‌లో స్ట్రీమింగ్‌ చేయడానికి వీలులేదు’ అని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆదేశించింది. తాజాగా ఈ నిర్ణయంతో నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైం వీడియో, యూట్యూబ్‌, జియో సినిమా సహా అన్ని ఓటీటీ ప్లాట్‌ఫాం ఇకపై పాక్‌ కంటెంట్‌ స్ట్రీమింగ్‌ని భారత్‌ నిలిపివేయనున్నాయి.

ఇవి కూడా చదవండి: