Published On:

Pahalgam terror attack: గుండె ముక్కలైంది.. పహల్గాం ఉగ్రదాడిపై చిరంజీవి, మహేష్‌ బాబు ఆవేదన

Pahalgam terror attack: గుండె ముక్కలైంది.. పహల్గాం ఉగ్రదాడిపై చిరంజీవి, మహేష్‌ బాబు ఆవేదన

Chiranjeevi Reacts On Pahalgam terror attack: జమ్మూకశ్మీర్‌లోని ఉగ్రవాదుల కాల్పుల ఘటనపై మెగాస్టార్‌ చిరంజీవి, మహేష్‌ బాబు, ఎన్టీఆర్‌ వంటి సినీ హీరోలు స్పందించారు. ఇది క్రూరమైన చర్య అంటూ ఈ ఘటనను ఖండించారు. మెగాస్టార్‌ చిరంజీవి, జూనియర్‌ ఎన్టీఆర్‌, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు వంటి స్టార్‌ హీరో ట్విటర్‌ వేదికగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 

మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో దుండగులు అతి సమీపంలో పర్యటకులపై కాల్పులు జరిపారు. మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడికి దిగారు. ఈ ఘటనలో సుమారు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మినీ స్వజ్జర్లాండ్‌గా పేరొందిన అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాం సమీప బైసరన్‌ లోయలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

 

దీనిపై మెగాస్టార్‌ చిరంజీవి స్పందిస్తూ ట్విటర్‌ వేదికగా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. “జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది అమాయక ప్రజలు, పర్యటకులపై కాల్పులు జరిపి చంపడం క్రూరమైన చర్య. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూస్తుంటే గుండె పగిలిపోతుంది. ఈ నష్టాన్ని ఎవరూ పూడ్చలేనిది. మరణించిన వారి కుటుంబాలకు బరువెక్కిన హృదయంతో సానుభూతి తెలుపుతున్న” అని రాసుకొచ్చారు.

 

 

“పహల్గామ్‌ దాడిలో మరణించిన వారిని చూస్తుంటే నా హృదయం బాధతో బరువెక్కుతుంది. ఇప్పుడు నా ఆలోచనలనని మరణించిన వారి కుటుంబాల చూట్టే తిరుగుతున్నాయి. వారి ఆత్మకు శాంతిచేకూరాలని, బాధితులకు న్యాయం జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా” అని జూనియర్‌ ఎన్టీఆర్‌ అన్నారు.

 

“ఇది చాలా దారుణం. పహల్గామ్‌ దాడి ఘటన చూసి నా హృదయం ముక్కలైంది. దయ హృదయులైన మనుషులతో ఉన్న ఎంతో అందమైన ప్రదేశంలో ఇలాంటి దారుణ ఘటన జరగడం దారుణం. బాధితుల కుటుంబాలకు, వారి బంధువులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. ఇది నిజంగా ఎంతో క్రూరమైన ఈ దుర్ఘటన” అని అల్లు అర్జున్‌ రాసుకొచ్చాడు.

 

 

“ఇది చీకటి రోజు.. పహల్గామ్‌లో జరిగిన దాడి ఘటన నన్ను తీవ్రంగా బాధించింది. ఇలాంటి క్రూరమైన చర్యకు వ్యతిరేకంగా కలిసి నిలబడే శక్తి మనకు లభిస్తుందని ఆశిస్తున్నా. ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలు, ప్రార్థనలు బాధిత కుటుంబాలకు ఉంటాయి” అని మహేష్‌ బాబు స్పందిస్తూ ఈ ఘటనను ఖండించారు.