Israeli Milatary Attacks: గాజా పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడులు.. 39 మంది మృతి..
గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ప్రపంచదేశాలన్నీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతిన్యాహును కాల్పుల విరమణకు ఒప్పుకోవాలని ఒత్తిడి చేసినా ససేమిరా అంటున్నారు.
Israeli Milatary Attacks: గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ప్రపంచదేశాలన్నీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతిన్యాహును కాల్పుల విరమణకు ఒప్పుకోవాలని ఒత్తిడి చేసినా ససేమిరా అంటున్నారు. ప్రపంచదేశాల సరసన ఒంటరైనా ఫర్వాలేదు. హమాస్‌ను మొత్తం తుడిచిపెట్టే వరకు యుద్ధం ఆపే ప్రసక్తి లేదని అంటున్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటికి గాజా నగరం మొత్తం నేల మట్టం అయ్యింది. సుమారు 36,586 మంది మృతి చెందారు. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడిలో కనీసం 39 మంది చనిపోయారంటూ వార్తలు వస్తున్నాయి. సెంట్రల్ గాజాలోని ఓ స్కూల్లో తలదాచుకుంటున్న నిర్వాసితులపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. దీంతో కనీసం 39 మంది మృతి చెంది ఉంటారు.
కిటకిటలాడుతున్న గాజా అల్ అస్కా ఆస్పత్రి..(Israeli Milatary Attacks)
కాగా ఇజ్రాయెల్ మిలిటరీ కూడా ఈ విషయాన్ని ఖరారు చేసింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఫైటర్ జెట్ యూఎన్‌ఆర్‌డబ్ల్యుఏ స్కూల్ ఏరియాను లక్ష్యంగా చేసుకొని బాంబుల వర్షం కురిపించిందని వెల్లడించారు. ఇదిలా ఉండగా గాజాలోని అల్ అస్కా ఆస్పత్రి ప్రస్తుతం క్షతగాత్రులతో కిటకిటలాడుతోంది. ఆస్పత్రి సామర్థ్యం కంటే మూడు రెట్ల పెషంట్లకు చికిత్స అందిస్తున్నట్లు పాలస్తీనా ప్రభుత్వ మీడియా అధికార ప్రతినిధి ఇస్మాయిల్ అల్ త్వాబాటా చెప్పారు. కాగా యూఎన్‌ఆర్‌డబ్ల్యు స్కూల్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసిన తర్వాత మృతి చెందిన వారితో పాటు గాయపడిన వారిని పెద్ద ఎత్తున ఆస్పత్రికి తరలిస్తున్నారు.
గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడులు చేసి ఏకంగా 1,200 మందిని చంపి 250 మందిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఆ రోజు నుంచి మొదలుపెట్టిన యుద్ధం ఇప్పటి వరకు కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు కనీసం 36,586 మంది పౌరులు చనిపోగా.. 83,074 మంది గాయపడ్డారు. గాజా నగరం మొత్తం నేలమట్టం కావడంతో సుమారు పది లక్షల కంటే ఎక్కువ మంది నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం వీరంతా ఆకలితో అలమటిస్తున్నారు. పరిస్థితిలో మార్పు రాకుంటే వచ్చే నెల రెండవ వారం నుంచి ఆకలి చావులు తప్పవన్న ఐక్యరాజ్యసమతి ఆందోళన వ్యక్తం చేసింది.