Al Roeya newspaper: చమురు ధరల వార్తలు పెరిగాయని రాసారు.. పత్రిక మూసేసారు..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో చమురు ధరలు పెరగడం పై ప్రజా స్పందనను వెల్లడించినందుకు ఇక్కడి అల్ రోయా పత్రిక సంపాదకులు, విలేకరుల ఉద్యోగాలు ఊడిపోవడమే కాదు, ఏకంగా పత్రిక ప్రింట్ ఎడిషన్ శాశ్వతంగా మూతబడిపోయింది.
Dubai: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో చమురు ధరలు పెరగడం పై ప్రజా స్పందనను వెల్లడించినందుకు ఇక్కడి అల్ రోయా పత్రిక సంపాదకులు, విలేకరుల ఉద్యోగాలు ఊడిపోవడమే కాదు, ఏకంగా పత్రిక ప్రింట్ ఎడిషన్ శాశ్వతంగా మూతబడిపోయింది. ఈ ఏడాది జూన్‌లో ఈ సంఘటన జరిగింది. 2012లో ప్రారంభమైన ఈ పత్రిక ప్రచురణకర్త అబుధాబీకి చెందిన ఇంటర్నేషనల్ మీడియా ఇన్వెస్ట్‌మెంట్స్ సంస్థ. యూఏఈ అధ్యక్షుడి సోదరుడు, కోటీశ్వరుడు షేక్ మన్సూర్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ దాని యజమాని.
చమురు ఉత్పత్తి చేసే ఇతర అరబ్ దేశాలకు భిన్నంగా యూఏఈ తన ప్రజలకు భారీ సబ్సిడీపై పెట్రోలు, డీజిల్ సరఫరా చేయడం మానేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోవడంతో యూఏఈ ప్రజలకు ఇంధన ధరల సెగ బాగా తగిలింది. దాంతో వారు చమురు వినియోగం తగ్గించుకొనే పద్ధతులను ఉపయోగించసాగారు. సరిహద్దులో నివసించేవారు పొరుగు దేశం ఒమన్‌కు వెళ్లి అక్కడ మహా చౌకగా దొరికే పెట్రోలు, డీజిల్‌ను తమ కార్లలో నింపుకొని వస్తున్నారు. కొందరైతే అదనపు ఇంధన టాంకుల్లో ఇంధనాన్ని తీసుకుని మరీ ఇళ్లకు తిరిగొస్తున్నారు. వీరిని ఇంటర్వ్యూచేసి తమ వెబ్‌సైట్‌లో ప్రచురించడమే అల్ రోయా పాత్రికేయులు చేసిన నేరం. అయితే, సెన్సార్‌కు జడిసి సదరు వార్తను కొన్ని గంటల్లోనే వెబ్‌సైట్ నుంచి తొలగించారు.
అయినా సరే ఈ వార్త ప్రచురించినందుకు అల్ రోయా సిబ్బందిపై యాజమాన్యం మండిపడింది. ఎనిమిదిమంది ఉన్నత శ్రేణి సంపాదకులతో సహా మొత్తం 35 మందితో నిర్బంధంగా రాజీనామా చేయించింది. జూన్ 21న అల్ రోయా ప్రింట్ ఎడిషన్‌ను మూసివేసింది. ఊరడింపుగా ఈ సంవత్సరాంతానికి సీఎన్‌ఎన్ బిజినెస్ అరబిక్ అనే డిజిటల్ వేదికను ప్రారంభిస్తామని యాజమాన్యం ప్రకటించింది.