Pakistan petroleum products:పెట్రోలియం ఉత్పత్తుల ధరలను స్వల్పంగా తగ్గించిన పాకిస్తాన్
పాకిస్తాన్ ప్రస్తుతం పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రజలకు కనీస అవసరాలు తీరడం లేదు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
Pakistan petroleum products:పాకిస్తాన్ ప్రస్తుతం పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రజలకు కనీస అవసరాలు తీరడం లేదు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అవి కూడా మార్కెట్లో లభించడం లేదు. పెట్రోల్ ధరలు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తోంది ప్రభుత్వం. దీంతో ఆర్థికమంత్రి ఇషాక్ దార్ పెట్రోలియం ఉత్పత్తుల ధరలు స్వల్పంగా తగ్గించింది. సవరించిన ధరలు మార్చి 1వ తేదీ నుంచి మార్చి 15 వరకు అమల్లో ఉంటాయని ఇషాక్ దార్ ట్విట్ చేశారు.
పెట్రోల్ ధర లీటరకు 5 రూపాయలు తగ్గించి 267కు సవరించారు. అదే విధంగా కిరోసిన్ ఆయిల్ లీటరుకు 15 రూపాయలు తగ్గించి 187.73కు తగ్గించారు. లైట్ డిజిల్ ఆయిల్ లీటరుకు 12 తగ్గించి 184.68 పైసలకు, అయితే హై స్పీడ్ డిజిల్ అయిల్ ధరల్లో మాత్రం మార్పులేదు లీటరు 280 యధావిధిగా కొనసాగుతుంది.
130 బిలియన్ డాలర్లకు చేరిన పాకిస్తాన్ అప్పులు..( Pakistan petroleum products)
తాజాగా ఏషియన్ డెవలెప్మెంట్ బ్యాంక్ ఇన్సిస్టిట్యూట్ నిర్వహించిన అధ్యయనంలో పాకిస్తాన్ అప్పులు తలకు మించిన భారంగా పరిణమించనున్నాయని తేల్చి చెప్పింది. పాక్ విదేశీ అప్పులు 130 బిలియన్ డాలర్లు.. దేశ జీడీపీలో 95.39 శాతం అప్పులే ఆక్రమించాయి. నగదుకు కటకటలాడుతున్న పాకిస్తాన్ వచ్చే 12 నెలల కాలంలో 22 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తం అప్పులు చెల్లించాల్సి ఉంది. కాగా మరో 80 బిలియన్ డాలర్లు వచ్చే మూడున్నర సంవత్సరాల్లో తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం స్టేట్ బ్యాంకు ఆఫ్ పాకిస్తాన్ వద్ద కేవలం 3.2 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యం నిల్వలు మాత్రమే ఉన్నాయి. దీంతో దేశ జీడీపీ వృద్దిరేటు కేవలం 2 శాతం మాత్రమే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పాకిస్తాన్ బడ్జెట్లో 50 శాతం అప్పులు తీర్చడానికే సరిపోతోంది. అదే సమయంలో అప్పులు భారాన్ని తగ్గించుకోవడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. వాటిలో ఆర్థిక క్రమశిక్షణ పాటించడంతో పాటు ప్రభుత్వరంగానికి చెందిన కంపెనీలన ప్రైవేట్ పరం చేయడం, అదే సమయంలో పన్ను వ్యవస్థలో సంస్కరణలు తేవడం లాంటివి అమలు చేస్తున్నాయి. అయినా చుక్కలనంటుతున్న ద్రవ్యోల్బణం మాత్రం అదుపులోకి రావడం లేదు.
48 ఏళ్ల గరిష్ఠానికి పాక్ ద్రవ్యోల్బణం..
ఇక పాక్ ద్రవ్యోల్బణం 48 ఏళ్ల గరిష్ఠానికి ఎగబాకింది. ఈ ఏడాది జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 27.6 శాతంగా నమోదైంది. ఆహార ద్రవ్యోల్బణం 42.9 శాతంగా నమోదు కాగా.. క్రితం ఏడాది ఇదే నెలలో 12.8 శాతంగా నమోదైంది. దీంతో దేశంలోని లక్షలాది మంది పౌరులకు ఒక్క రోజు పూట గడవడమే గగగనమైపోతోంది. ఇదిలా ఉండగా పాక్ సెంట్రల్ బ్యాంకు వడ్డీరేట్లు 17 శాతానికి పెంచేసింది. దీంతో వ్యాపారలావాదేవీలు మందగించాయి. దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థ పడుతోంది. దీంతో పాకిస్తాన్ రుణాల కోసం ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌లపై ఆధారపడుతోంది. ఇప్పటి వరకు 22 సార్లు ఐఎంఎఫ్ వద్దకు వెళ్లివచ్చింది.
సరిగా లేని పాకిస్తాన్ పన్నుల వ్యవస్ద..
పాకిస్తాన్లో పన్ను విధానం సరిగా లేదని యూనైటెడ్ నేషన్స్ డెవలెప్మెంట్ ప్రోగ్రాం వెల్లడించింది.పాక్ జీడీపీ 6 శాతం అంటే 17.4 బిలియన్ డాలర్లు అత్యంత సంపన్నులపై వెచ్చిస్తోంది. వారికి పన్ను రాయితీలు ఇవ్వడంతో పాటు అతిపెద్ద భూస్వాముల నుంచి పన్ను వసూలు చేయడంలేదు. అలాగే కార్పొరేట్ సెక్టార్‌తో పాటు శక్తిమంతమైన మిలిటరీపైన, రాజకీయ నాయకులపై పెద్ద ఎత్తున వ్యయం చేస్తోంది. అలాగే జీడీపీలో 8 నుంచి 12 శాతం ప్రతి ఏడాది నష్టాల్లో కూరకుపోయిన కంపెనీలపై వ్యయం చేస్తోందని వరల్డ్ బ్యాంకు విడుదల చేసిన హిడెన్ డెబిట్ అనే నివేదికలో వెల్లడించింది.
మొత్తానికి పాకిస్తాన్ పన్ను వ్యవస్థ దారుణంగా ఉంది. అల్పాదాయ వర్గాల వారిపై పెద్ద ఎత్తున పన్నుల భారాన్ని మోపుతోంది. అదే సమయంలో సగం పన్నులు ప్రత్యక్ష పన్నుల ద్వారా వసూలు చేస్తోంది. ఇక్కడ మరో అంశం ఏమిటంటే వ్యవసాయరంగపై ఎలాంటి పన్ను విధించడం లేదు. దేశం నుంచి ఎగుమతి అయ్యే వ్యవసాయ రంగానికి చెందిన ఉత్పత్తులు 60 నుంచి 70 శాతం ఆక్రమించాయి. అయితే వాటిపై పన్ను 0.02 శాతం మాత్రమే వసూలు చేస్తున్నారు. షెహబాజ్ షరీఫ్ సర్కార్ పన్నుల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురాకపోతే పాకిస్తాన్ మరింత సంక్షోభంలో కూరుకుపోవడమే ఖాయమని అంటున్నారు ఆర్థిక నిపుణులు.