Megastar Chiranjeevi : ’అన్నయ్య‘ మద్దతు ’తమ్ముడు‘ కేనా
పవన్ కల్యాణ్‌కు భవిష్యత్‌లో మద్దతిస్తానేమో అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి
Megastar Chiranjeevi: పవన్ కల్యాణ్‌కు భవిష్యత్‌లో మద్దతిస్తానేమో అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. గాడ్‌ఫాదర్ యూనిట్ స్పెషల్ ప్రెస్‌మీట్‌లో చిరంజీవి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇక అన్నయ్య మద్దతు తమ్ముడికేనా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘గాడ్‌ఫాదర్’ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం చిత్ర బృందం స్పెషల్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్‌మీట్‌లో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాన్ని చిరంజీవి ఆకాశానికి ఎత్తేశారు. పవన్‌ను తన సోదరుడిగా పదే పదే పేర్కొన్న చిరు… పవన్ నిబద్ధత, నిజాయతీ కలిగిన నేత అని అన్నారు. తన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు భవిష్యత్‌లో మద్దతిస్తానేమోనంటూ చిరంజీవి పేర్కొన్నారు. పవన్ మంచి స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నానని చిరంజీవి తెలిపారు. ఏపీ రాజకీయాలు… ప్రత్యేకించి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనకు మద్దతు… ఏపీ ప్రజలకు ఏ తరహా నాయకత్వం రావాలన్న అంశాలపై చిరంజీవి కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
నేను పాలిటిక్స్ నుంచి ఎగ్జిటై.. సైలెంట్‌గా ఉండటమే.. మా తమ్ముడికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలా అని ఉంటానేమో తెలియదు నాకు. నా మద్దతు నా తమ్ముడికి అని స్ట్రాంగ్‌గా అని నేనెక్కడా మాట్లాడలేదు. భవిష్యత్‌లో చేస్తానేమో తెలియదు.. అతను నా తమ్ముడు. నా తమ్ముడులోని నిబద్ధత, నిజాయితీ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఎక్కడా పొల్యూట్ కాలేదు.. అంతటి నిబద్ధత ఉన్న నాయకులు మనకు రావాలి. వాడు ఏ పక్షాన ఉంటాడు.. ఎటుంటాడు, ఎలా ఉంటాడనేది.. భవిష్యత్‌లో ప్రజలు నిర్ణయిస్తారు. అలాంటి వాడు రావాలనే నా ఆకాంక్ష. దానికి ఖచ్చితంగా నా మద్దతు ఉంటుంది. నేనొక పక్కన, తనొక పక్కన ఉండటం కంటే.. నేను విత్ డ్రా చేసుకుని సైలెంట్ అయిపోవడంతో అతను పైపైకి వస్తాడు.. భవిష్యత్‌లో మంచి నాయకుడు అవుతాడు. ఏమో.. ఏలే అవకాశం ప్రజలు ఇస్తారేమో.. అని నేను భావిస్తాను.. అలాంటి రోజు రావాలని కూడా కోరుకుంటున్నాను.. అని చిరంజీవి పేర్కొన్నారు.
2024లో ఏపీలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ ముందుకెళ్తున్న నేపథ్యంలో చాలా రోజుల తర్వాత తాను తమ్ముడికి భవిష్యత్‌లో మద్దతు ఇస్తానేమో..అంటూ చిరంజీవి మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా మారాయి. అటు.. గాడ్ ఫాదర్ సినిమాలోని డైలాగ్స్ పై కూడా చిరంజీవి స్పందించారు. ప్రస్తుత నాయకులపై ఎలాంటి సెటైర్లు వేయలేదంటూ స్పష్టంచేశారు. మాతృకలో ఉన్న కథ ఆధారంగానే డైలాగులు రాశామని తెలిపారు. ఈ డైలాగులు విని ఎవరైనా భుజాలు తడుముకుంటే తానేం చేయలేనన్నారు చిరంజీవి.
అసలు గాడ్ ఫాదర్ చిత్రమే.. ఓ రకంగా సైలెంట్‌గా ఉన్న చిరు మళ్లీ పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యేందుకు ర్యూట్ మ్యాపా అన్నట్టే కనిపిస్తోంది. ఆయన ఫస్ట్ రిలీజ్ చేసిన డైలాగే సంచలనం సృష్టించింది. రాజకీయాలు నాకు కొత్త కాదంటూ ట్విట్టర్లో రిలీజ్ చేసిన డైలాగ్‌తో ఒక్కసారిగా మెగా పొలిటికల్ సంచలనాన్ని క్రియేట్ చేసింది. అయితే, చిరు.. తన పొలిటికల్ ఫ్యూచర్ గురించి ఓ రకంగా క్లారిటీ ఇచ్చారా..? అని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.