WTC Final 2025: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్.. విజృంభించిన రబాడ!
South Africa vs Australia in WTC Final 2025: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య హోరాహోరీగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలి రోజు బౌలర్ల హవా కొనసాగింది. తొలి ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా జట్టుపై దక్షిణాఫ్రికా బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. దీంతో ఆస్ట్రేలియా 212 పరుగులకే కుప్పకూలింది.
ఆసీస్ బ్యాటర్లలో వెబ్ స్టర్(72), స్టీవెన్ స్మిత్ (66) పరుగులతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఓపెనర్ ఖవాజా(0) డకౌట్ అయ్యాడు. గ్రీన్(4), లబుషేన్(11), హెడ్ (11), కేరీ(23) పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ విజృంభించాడు. ఈ మ్యాచ్‌లో రబాడ 5 వికెట్లు పడగొట్టగా.. యాన్సెన్ 3 వికెట్లు, కేశవ్ మహరాజ్, మార్ క్రమ్ చెరో వికెట్ తీశారు.
ఇక, ఆస్ట్రేలియా జట్టు ఆలౌట్ అయిన తర్వాత తొలిరోజే బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికాకు నిరాశ ఎదురైంది. ఓపెనర్లను స్టార్క్ బోల్తా కొట్టించాడు. అద్భుతంగా బౌలింగ్ వేయడంతో మార్ క్రమ్(0), రికిల్టన్(16) ఔట్ అయ్యారు. ఆ తర్వాత కమిన్స్ బౌలింగ్‌లో ముల్డర్(6), హేజిల్ వుడ్ బౌలింగ్‌లో స్టబ్స్(2) పెవిలియన్ చేరారు. ప్రస్తుతం బవుమా(3), బెడింగ్ హామ్ (8) క్రీజులో ఉన్నారు. దీంతో దక్షిణాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసింది.
లార్డ్స్‌లో తొలి రోజు బౌలర్లదే హవా నడిచింది. ఇరు జట్ల బౌలర్లు మొత్తం 14 వికెట్లు తీశారు. పేసర్లకే 12 వికెట్లు పడగా.. స్పిన్నర్లకు 2 వికెట్లు మాత్రమే పడ్డాయి. ఈ పిచ్‌లో బంతి అద్భుతంగా స్వింగ్ అవుతోంది. బంతి ఈ విధంగా స్వింగ్ అయితే మరో 3 రోజుల్లోనే మ్యాచ్ ముగిసే అవకాశం ఉంది.