WTC Final: నేటి నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య పోరు
ICC Test Championship: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పోరుకు సమయం ఆసన్నమైంది. లండన్ లోని లార్డ్స్ స్టేడియం వేదికగా నేటి నుంచి ప్రారంభంకానున్న ప్రతిష్టాత్మక పోరులో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. కాగా ఈ మ్యాచ్ లో గెలిచి టైటిల్ సాధించాలని ఇరుజట్లు గట్టి పట్టుదల మీద ఉన్నాయి. ఇప్పటికే ఐసీసీ నిర్వహించిన అన్ని ఫార్మట్లలో టైటిళ్లు సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ లో కూడా గెలిచి మరో టైటిల్ ను తన అకౌంట్ లో వేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియా జోరుకు అడ్డుకట్ట వేసేలా సౌతాఫ్రికా కూడా మ్యాచ్ గెలవాలని ప్రయత్నిస్తోంది. దీంతో ఇరుజట్ల మధ్య రసవత్తర పోరు జరిగే ఛాన్స్ ఉంది. కాగా విజయం ఎవరిని వరిస్తుందోనని క్రికెట్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.
అయితే జట్టు బలాబలాల పరంగా చూస్తే ఆస్ట్రేలియా జట్టులోని కీలక ఆటగాళ్లంతా పూర్తి ఫిట్ నెస్ తో ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా అద్భుతంగా రాణించడం కలిసొచ్చే అంశం. మరోవైపు సౌతాఫ్రికా కూడా బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగి ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్ పైనే సౌతాఫ్రికా నమ్మకం పెట్టుకుంది. కానీ బౌలింగ్ లో సౌతాఫ్రికా సత్తా చాటితే మాత్రం ఆ జట్టు గెలవడం ఈజీ అవుతుంది. ఒకవేళ ఈ టైటిల్ ను సౌతాఫ్రికా సాధిస్తే అది చరిత్ర సృష్టించినట్టే. ఎందుకంటే సఫారీ జట్టు ఐసీసీ నిర్వహించిన ఏ ఫార్మట్ లోనూ టైటిల్ ను సొంతం చేసుకోలేదు. ఒకవేళ ఆ జట్టు ఈ మ్యాచ్ గెలిస్తే ఐసీసీ తొలి టైటిల్ సొంతం చేసుకున్నట్టు అవుతుంది.
ఆస్ట్రేలియా జట్టు:
ఖవాజా, లబుషేన్, కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, హెడ్, వెబ్ స్టర్, కేరీ, కమిన్స్ (కెప్టెన్), స్టార్క్, హేజిల్ వుడ్, లైయన్.
సౌతాఫ్రికా జట్టు:
మార్కృమ్, రికిల్ టన్, ముల్దర్, బవుమా (కెప్టెన్), స్టబ్స్, బెడింగ్ టన్, కైల్ వెరీన్, యాన్సెన్, కేశవ్ మహరాజ్, రబాడ, ఎండిగి.