Published On:

Tamilnadu: జైశ్రీరామ్ అంటూ నినాదాలు.. మరో వివాదంలో చిక్కుకున్న తమిళనాడు గవర్నర్

Tamilnadu: జైశ్రీరామ్ అంటూ నినాదాలు.. మరో వివాదంలో చిక్కుకున్న తమిళనాడు గవర్నర్

Tamil Nadu Governor R N Ravi in another Issue: తమిళనాడు గవర్నర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. జై శ్రీరామ్ అంటూ తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి నినాదాలు చేశారు. రాష్ట్రంలోని ఓ కళాశాల వేడుకకు ముఖ్యఅతిథిగా గవర్నర్ ఆర్.ఎన్. రవి హాజరయ్యారు. ఇందులో భాగంగా సభా వేదికగా ప్రసంగిస్తున్న ఆయన జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం విద్యార్థులతోనూ ఆయన నినాదాలు చేయించారు. అయితే, గవర్నర్ ఆర్.ఎన్. రవి వైఖరిని తమిళ, ద్రవిడ సంఘాలు తప్పుబట్టాయి. గవర్నర్‌ను వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు.

 

కాగా, మధురైలోని త్యాగరాజర్ ఇంజనీరింగ్ కళాశాలలో ‘కంబర్ ఇన్ ఎడ్యుకేషనల్ హాల్స్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యారు. ఈ మేరకు రాష్ట్రస్థాయి ప్రసంగ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన వేదికపై ప్రసంగించారు.

 

కంబాన్ని, కంబ రామాయణాన్ని మరచిపోకూడదన్నారు. కంబరు రామాయణంలో ఎన్నో మంచి విషయాలు నేర్పారన్నారు. ప్రధానంగా మహిళలను ఎలా గౌరవించాలో నేర్పించారన్నారు. ఇందులో భాగంగానే తమిళనాడులో ఓ అధికారి పార్టీకి చెందిన వ్యక్తి బహిరంగంగా మహిళలను కించపరిచేలా మాట్లాడడాన్ని గుర్తు చేశారు. మహిళలపై ఇలా వ్యవహరించడం మంచిది కాదన్నారు.

 

ఆ తర్వాత ప్రసంగం ముగించే సమయంలో అక్కడ ఉన్న విద్యార్థులతో కలిసి జై శ్రీరామ్ అనే నినాదాలు చేశారు. దీనికి తిరిగి విద్యార్థులు సైతం జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.విద్యా సంస్థలో ఇలాంటి నినాదాలు చేయడం కరెక్ట్ కాదని ద్రవిడ, తమిళ సంఘాలు ఆరోపించాయి. కాగా, ఇప్పటికే బిల్లు సస్పెన్షన్‌ విషయంలో గవర్నర్ ఆర్.ఎన్.రవిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయగా.. తాజాగా, మరో వివాదంలో చిక్కుకున్నాడు.