Delimitation JAC meeting: ఢీలిమిటేషన్‌తో పొలిటికల్ వాయిస్ తగ్గిపోతుంది.. జేఏసీ భేటీలో సీఎం స్టాలిన్

Tamilnadu CM Stalin Intresting Comments About Delimitation: ఢీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తూ తమిళనాడులోని చెన్నై నగరంలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల సీఎంలు, విపక్ష నేతలు హాజరయ్యారు. ఈ సందర్బంగా తమిళనాడు సీఎం స్టాలిన్ మాట్లాడారు. జనాభా లెక్కల ఆధారంగా చేపట్టే డీలిమిటేషన్ వ్యతిరేకించాలన్నారు. హక్కుల కోసం అంతా ఐకమత్యంగా పోరాడాలని, లేదంటే మన దేశంలో మన రాష్ట్రాలకే అధికారం లేని పరిస్థితి వస్తుందని స్టాలిన్ అన్నారు.
ఢీలిమిటేషన్‌తో పొలిటికల్ పరంగగా మన వాయిస్ తగ్గిపోతుందని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే పార్లమెంట్‌లో మన ప్రాతినథ్యం తగ్గిపోతుందన్నారు. ఇది సంఖ్య తగ్గినట్లు కాదని, దీంతో మనం అధికారాన్ని కూడా కోల్పోతామని వెల్లడించారు. పునర్విభజనతో మహిళలు, విద్యార్థులకు నష్టం జరుగుతోందన్నారు. రాజకీయంగా దక్షిణాది గళం వినిపించే అవకాశం ఉండదన్నారు. ఎంపీ సీట్లు తగ్గితే కేంద్రం నుంచి నిధులు కూడా తగ్గిపోతాయని చెప్పారు.
ఇదిలా ఉండగా, దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 25, తెలంగాణ 17, తమిళనాడు 39, కర్ణాటక 28, కేరళ 20 సీట్లు ఉన్నాయి. అయితే, డీలిమిటేషన్‌తో తమిళనాడులో 8 నుంచి 12 సీట్లు తగ్గుతాయని వివరించారు. మన దేశంలో ప్రతీ రాష్ట్రానికి ఓ ప్రత్యేకత ఉందన్నారు. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలని, అప్పుడే దేశాభివృద్ధి సాధ్యమని అన్నారు.
దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిథ్యం తగ్గడంతో మన గురించి అవగాహన లేని వాళ్లు కూడా మనపై వాళ్ల అభిప్రాయాన్ని రుద్దుతారన్నారు. మన స్త్రీల హక్కులకు సైతం భంగం కలుగుతుందన్నారు. అలాగే మన అభిప్రాయానికి విలువ లేకుండా పోతుందని, మన గొంతు వినిపించే వాళ్లు తగ్గిపోతారన్నారు. ముఖ్యంగా భవిష్యత్ తరాల శ్రేయస్సుకు భంగం కలుగుతుందన్నారు.
కాగా, లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టంపై అఖిల పక్ష పమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ మేరకు తమిళనాడు సీఎం స్టాలిన్ స్వాగతం పలికారు. అయితే సమావేశానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డుమ్మా కొట్టగా.. టీడీపీ, జనసేన, వైసీపీ దూరంగా ఉన్నారు.