Monsoon Update: కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా 24గంటల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకరోజు ముందే దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి.
Monsoon Update: నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా 24గంటల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకరోజు ముందే దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. మూడు లేదా నాలుగు రోజుల్లో ఏపీలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.
5 రోజులపాటు వర్షాలు..(Monsoon Update)
రుతుపవనాల ఆగమనంతో కేరళలో 5రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులతో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో తిరువనంతపురం, పతనం తిట్ట, కొల్లం తదితర ప్రాంతాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ ఏపీలో అక్కడక్కడ ఉరుములు.. మెరుపులతో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.
మరోవైపు రెమాల్ తుపాను తర్వాత దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. 2రోజులుగా రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో దేశమంతా నిప్పుల కుంపటిలా మారింది. దేశ రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సగటు ఉష్ణోగ్రతలు 50డిగ్రీలుగా నమోదు కావడంతో జనం విలవిలలాడిపోయారు. రాత్రి ఉష్ణోగ్రతలు పగటి ఉష్ణోగ్రతలతో పోటీ పడ్డాయి. ఢిల్లీలోని మంగేష్పూర్ ప్రాంతంలో నిన్న సాయంత్రం 4గంటల ప్రాంతంలో.. చరిత్రలో లేనంతగా 52.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయింది. ఎడారి ప్రాంతాల్లో మాదిరిగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతావరణశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. నిజంగానే అంత ఎండలు నమోదయ్యాయా.. లేక సెన్సార్లు సరిగా పనిచేయకపోవడం వల్ల.. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయా.. అనేది నిర్ధారించేందుకు ప్రత్యేక నిపుణుల బృందం రంగంలోకి దిగింది.
సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం..
ఈ సీజన్ లో రుతు పవనాల ప్రభావంతో సాధారణం కంటే ఎక్కువ వర్షం కురుస్తుందని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. తూర్పు, వాయవ్య, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మినహా దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా. 1951 నుంచి 2023వరకు ఎల్ నినో తర్వాత లానినా వచ్చిన సందర్భాల్లో భారత్ లో తొమ్మిదిసార్లు మంచి వర్షాలు కురిశాయని ఐఎండీ తెలిపింది. ఈ ఏడాది కూడా రుతుపవనాల కదలిక అందుకు అనుగుణంగానే ఉందని వాతావరణశాఖ వివరించింది.