Ayodhya Deepotsav: 22 లక్షలకు పైగా దీపాలతో ప్రపంచ రికార్డును సృష్టించిన అయోధ్య దీపోత్సవం
దీపోత్సవం యొక్క ఏడవ వార్షికోత్సవం సందర్భంగా అయోధ్యలోని సరయూ నది ఒడ్డున ఒకే చోట ఒకేసారి 22 లక్షలకు పైగా దీపాలను వెలిగించి కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు.ఈ దీపాలు గత సంవత్సరం కంటే 6.47 లక్షలు ఎక్కువ కావడం విశేషం.
Ayodhya Deepotsav: దీపోత్సవం యొక్క ఏడవ వార్షికోత్సవం సందర్భంగా అయోధ్యలోని సరయూ నది ఒడ్డున ఒకే చోట ఒకేసారి 22 లక్షలకు పైగా దీపాలను వెలిగించి కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు.ఈ దీపాలు గత సంవత్సరం కంటే 6.47 లక్షలు ఎక్కువ కావడం విశేషం.
నది వెంబడి ఉన్న రామ్ కి పైడిలోని 51 ఘాట్లలో 25,000 మంది వాలంటీర్లు వెలిగించారు. డ్రోన్ల ద్వారా దీపాలను లెక్కించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు రికార్డు సర్టిఫికెట్ ను అందించారు. ఈ సందర్బంగా అయోధ్య ‘జై శ్రీరామ్’తో ప్రతిధ్వనించింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుండి సర్టిఫికేట్ అందుకున్న తరువాత, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్య మరియు దాని నివాసితులకు శుభాకాంక్షలు తెలిపారు.
54 దేశాల దౌత్యవేత్తలు..(Ayodhya Deepotsav)
దీపోత్సవం సందర్బంగా సీఎం,ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ఇతర మంత్రివర్గ సభ్యులు సరయూ నది ఒడ్డున దీపాలు వెలిగించి ప్రార్థనలు చేశారు.54 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు అయోధ్యలో ఏడవ దీపోత్సవాన్ని చూశారు. ఈ వేడుక యొక్క ప్రత్యక్ష ప్రసారం 100 దేశాలలో ప్రసారం చేయబడింది.21 రాష్ట్రాలకు చెందిన కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు, 11 టేబులు, రష్యా, శ్రీలంక, సింగపూర్, నేపాల్‌కు చెందిన రాంలీలా ప్రదర్శనలు, భారతదేశం మరియు విదేశాలకు చెందిన 2,500 మంది కళాకారుల ప్రతిభ అయోధ్యను వెలిగించాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ, కాలేజీలు, ఇంటర్ కాలేజీలు, స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లు ఈ వేడుకలో చురుకుగా పాల్గొన్నారు.ఈ ఏడాది దీపోత్సవంజనవరి 22 న జరగనున్న శ్రీరామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు 72 రోజులు మిగిలి ఉండగానే అయోధ్యలో అపూర్వమైన కార్యక్రమంగా మారిందని అధికారిక ప్రకటన తెలిపింది.
2017లో, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు, అయోధ్యలో 1.71 లక్షల దీపాలు వెలిగించారు. అప్పటి నుండి రాష్ట్రంలో దీపోత్సవం ఒక ప్రధాన కార్యక్రమంగా మారింది.2018లో 3.01 లక్షల దీపాలు వెలిగించగా, 2019లో 4.04 లక్షలు, 2020లో 6.06 లక్షలు, 2021లో 9.41 లక్షలు, 2022లో 15.76 లక్షల దీపాలు వెలిగించబడ్డాయి.