Ayodhya: జాతిని జాగృతం చేసిన అయోధ్య.. అత్యంత వైభవంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠాపన
Ayodhya awakened the race: ‘నేను బతికుండగా ఆ దృశ్యాన్ని చూడగలనా?’ అని కోట్లాది మంది హిందువులు 500 ఏళ్ల పాటు మథనపడిన ఆ ఘట్టం నిరుటి జనవరి 22న అయోధ్యలో సాకారమైంది. నిరుటి పుష్య శుక్ల ద్వాదశి తిథి నాడు సకల రాజలాంఛనాలతో బాలరాముడి ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. దీర్ఘకాలం పాటు ఒక చిన్న టెంటులో అనామకంగా ఉంటూ పూజలందుకున్న బాలరాముడు.. అత్యంత సుందరమైన మందిరంలో సకల రాజోపచారాలతో కొలువైన నాటి బాల రాముడి ప్రాణప్రతిష్ట వేడుక ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. భారత రాజకీయ, ఆధ్యాత్మిక చరిత్రలోనే మహోన్నతమైన ఆ ఘట్టం జాతి జనుల మనసులో ఎన్నటికీ చెరగని మధుర జ్ఞాపకంగా నిలిచింది. ఆ చారిత్రక సన్నివేశానికి రేపటితో ఏడాది నిండనుంది. ఆధునిక భారత దేశ చరిత్రలో హిందువుల సాంస్కృతిక పునరుజ్జీవనం, అస్తిత్వానికి సంబంధించిన ఈ అంశంలో యావత్ హిందూ సమాజం ఒక్కటిగా నిలిచిన తీరు ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది.
క్రీ. శ 1528లో బాబర్ ప్రధాన సేనాని మీర్ బాకీ అయోధ్యలోని రామమందిరాన్ని నాశనం చేసిన నాటి నుంచి, పలు దశలలో ఐదు శతాబ్దాల పాటు అయోధ్య ఉద్యమం కొనసాగుతూ వచ్చింది. క్రీ.శ 1853లో దీనిపై న్యాయపోరాటం మొదలైంది. క్రీ.శ 1855లో రామజన్మభూమిలోని ‘సీతా కి రసోయి’ అనే ప్రాంతంతో బాటు ‘రామ్ చబూత్రా’ని సాధుసంతులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, క్రీ.శ 1859లో నాటి బ్రిటిష్ పాలకులు మందిరం లోపలి భాగాన్ని ముస్లిములకీ, బయటి భాగాన్ని హిందువులకీ పంచి మధ్యలో ఒక ఫెన్సింగ్ వేశారు. క్రీ.శ 1885లో మహంత్ రఘువర్ దాస్ అనే సాధుపుంగవుడు రామ్ చబూత్ర పైన చత్రం నిర్మించుకోవటానికి అనుమతి కోరుతూ కోర్టులో ఒక పిటిషన్ వేశాడు. తర్వాతి కాలంలో 1934లో అయోధ్యలో కొందరు ముస్లింలు బహిరంగంగా గోహత్యకు పాల్పడటంతో, హిందూ ముస్లిం వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇది ఉద్రిక్తతలకు దారితీసిన క్రమంలో అక్కడి సాధుసంతులు, హిందువులు బాబ్రీ కట్టడం మీద దాడి చేశారు. నాటి ఘటనలో దాని మూడు గుమ్మటాలు దెబ్బతినగా, అదే రోజు హిందువులు ఆ కట్టడాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. అయితే, క్రీ.శ 1949 డిసెంబర్ 22 గురువారం నాటి వేకువజామున క్రీ.శ 1528లో ఏ స్థలం నుంచి బాలరాముడి మూర్తి తొలగించబడిందో, అక్కడే ఆశ్చర్యకరమైన రీతిలో రామయ్య విగ్రహం ప్రత్యక్ష్యం కావటం, బిందేశ్వరీ ప్రసాద్ అనే సాధువు నాయకత్వంలోని సాధు బృందం ఆ కట్టడపు తాళాలు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి పూజాభిషేకాలు నిర్వహించటం జరిగింది. నాటి నుంచి బాలరాముడు పూజారుల చేత పూజలందుకుంటూ వస్తున్నాడు.
అయితే, రామ జన్మభూమి అంశాన్ని ప్రతి గ్రామానికీ తీసుకుపోవాలనే సంకల్పంతో 1982-83లో మోరోపంత్ పింగళే అనే జాతీయవాది దేశవ్యాప్తంగా 50 వేల కి.మీ మేర 3 ఏకాత్మతా యాత్రలు సంకల్పించారు. వాటిలో మొదటిది హరిద్వార్ నుంచి కన్యాకుమారి వరకూ, రెండవది నేపాల్ రాజధాని ఖాట్మండూలోని పశుపతినాథ మందిరం నుంచి తమిళనాడులోని రామేశ్వర ఆలయం వరకు, మూడవది బెంగాల్‌లోని గంగాసాగర్ నుంచి గుజరాత్ లోని సోమనాథ్ వరకూ జరిగింది. ఈ మూడు యాత్రలు ఒకే సమయంలో నాగపూర్‌లో ముగిసేలా పింగళే ఏర్పాట్లు చేయటంతో రామ జన్మభూమి అంశం దేశవ్యాపితమైంది. పిదప, విశ్వ హిందూ పరిషత్ నాయకత్వంలో 1984లో 500 మంది సాధుసంతులతో, అశోక్ సింఘాల్ ధర్మ సంసద్ సమావేశమై, అయోధ్య ఉద్యమాన్ని మరోసారి ఆరంభించింది. దీనికి కొనసాగింపుగా, అదే ఏడాది సెప్టెంబరు చివరిలో బీహార్‌లో సీత నాగేటి చాలులో ఉద్భవించిందని చెబుతున్న సీతామర్హి నుంచి అశోక్ సింఘాల్ అధ్వర్యంలో మొదటి రథయాత్ర మొదలైంది. 12 రోజుల శోభాయమాన యాత్ర తర్వాత వారంతా అయోధ్యలోని సరయూ నదీతీరాన ఆగి ఆ నదీజలాన్ని దోసిట పట్టి రామాలయ నిర్మాణం కోసం ప్రతిజ్ఞ చేశారు. ఆ రోజున అక్కడ ప్రతిజ్ఞ చేసిన 50,000 మంది కాగా దేశం నలుమూలలా పర్యటించి ఆయా పుణ్యనదీ తీరాల్లో ‘శ్రీరామ జన్మస్థానంలో ఆయనకు ఆలయం నిర్మించేందుకు మా సర్వస్వాన్నీ వదులుకుంటాం’అని ప్రతిజ్ఞ చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ‘రామజన్మభూమిలో.. భవ్యమైన మందిరం’అనే కోరిక హిందూసమాజంలో బలోపేతమవుతూ వచ్చింది.
ఈ క్రమంలో ఉమేష్ చంద్ర పాండే అనే ఒక యువ న్యాయవాది 1986 జనవరిలో ఫైజాబాద్ కోర్టులో అయోధ్యలోని మసీదుకు వేసిన తాళం తెరిపించి, భక్తులను లోపల కొలువుదీరిన బాలరాముడిని పూజించుకునే అవకాశాన్ని కల్పించాలని కేసు వేశాడు. ఈ కేసుపై 1986 ఫిబ్రవరి 1న కోర్టు సానుకూలంగా చరిత్రాత్మక తీర్పునివ్వటంతో అయోధ్యలో గుడి కట్టి తీరాలనే పట్టుదల మరింతగా హిందూసమాజంలో బలపడింది. ఈ క్రమంలో 1989లో దేశమంతటా శిలాపూజ కార్యక్రమాలు జరిగాయి. నాడు అక్కడ బీహార్‌కు చెందిన శ్రీ కామేశ్వర చౌహాల్ అనే దళితుడి చేతుల మీదగా నవంబర్ 10న రామజన్మభూమి ఆలయ శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత 1990 సెప్టెంబర్ 25న బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ గుజరాత్ లోని సోమనాథ్ నుంచి ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య వరకూ రామ రథయాత్రను సంకల్పించారు. ఆ యాత్రను బీహార్‌లో అడ్డుకొని అరెస్టు చేయటంతో, దేశవ్యాప్తంగా వాతావరణం వేడెక్కింది. తర్వాత 1992 డిసెంబరు 6న తలపెట్టిన కరసేవ కార్యక్రమంలో వివాదాస్పద కట్టడం నేలకూలడం, వివాదాస్పద స్థలంగా దశాబ్దాల తరబడి న్యాయస్థానంలో నానుతూ వచ్చిన రామ జన్మభూమి నిస్సందేహంగా ‘రామ్‌లల్లా విరాజ్‌మాన్ (కొలువుదీరిన చిన్నారి రాముడు)’దేనని 2019 నవంబరులో సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్ఫూర్తి, మార్గదర్శనంతో విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన రామజన్మభూమి క్షేత్ర విముక్తి ఉద్యమం తర్వాత తీర్థక్షేత్ర ట్రస్ట్ రంగంలోకి దిగి, అప్పటికే సిద్ధం చేసిన నమూనా ప్రకారం, ఒక్క రూపాయి సర్కారు ధనం తీసుకోకుండా భక్తుల విరాళాలతో దివ్యమైన, భవ్యమైన రామాలయం నిర్మించటం జరిగింది.
ఈ ఏడాది కాలంలో అయోధ్యలోని ఆలయాన్ని సుమారు 50 కోట్ల మంది సందర్శించారు. అయోధ్యలో చిన్నచిన్న వ్యాపారాలు మొదలు భారీ నిర్మాణాలూ మొదలయ్యాయి. అక్కడి దుకాణదారుల ఆదాయం గణనీయంగా పెరిగింది. అయోధ్యకు రోజూ లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఆగ్రాలోని తాజ్‌మహల్‌కంటే పది రెట్లు ఎక్కువగా పర్యాటకులు అయోధ్య బాటపడుతున్నారు. మరోవైపు, అయోధ్య వెళ్లేందుకు భారీ రహదారులు, హోటళ్లు, ఆసుపత్రులు తదితరాలు అందుబాటులోకి వచ్చాయి. అక్కడి వాల్మీకి విమానాశ్రయానికి దేశంలోని దాదాపు ప్రధాన నగరాల నుంచి విమాన సేవలు సాగుతున్నాయి. ఒకనాడు పోలీసు నిర్బంధంలో మగ్గిపోయిన అయోధ్యలోని పావన సరయూ తీరం నేడు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడతోంది. మొత్తంగా.. నేడు అయోధ్య కేవలం రామజన్మభూమి మాత్రమే కాదు.. అది భరతజాతి ఆత్మను తట్టిలేపిన జ్ఞానభూమిగా విలసిల్లుతోంది. ఇంకా విముక్తికి నోచుకోని అనేక ధార్మిక స్థలాలకు స్వేచ్ఛ కల్పించేలా హిందూ సమాజాన్ని నడిపించే చైతన్యభూమిగా నిలుస్తోంది.