ISRO: మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. ఈనెల 18న నింగిలోకి రాకెట్

PSLV-C61: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీస్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈనెల 18న ఉదయం 6.59 గంటలకు పీఎస్ఎల్వీ- సీ61 రాకెట్ ను ప్రయోగించనున్నట్టు ప్రకటించింది.
ఈ రాకెట్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దిన భూ పరిశీలన ఉపగ్రహం రీశాట్-1బీని కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఈ ఉపగ్రహంలో సీ- బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడర్ అనేది ప్రత్యేకత. ఈ రాడర్ సహాయంతో పగలు, రాత్రి.. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా భూ ఉపరితలాన్ని స్పష్టంగా ఫోటోలు తీసి పంపుతుంది.
దేశ భద్రత, సైనిక అవసరాలకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని అందించడంలో రీశాట్-1బీ కీలకం కానుంది. ఉగ్రవాదుల స్థావరాలు, వారి కదలికలను పసిగట్టడంతో పాటు, సరిహద్దు ప్రాంతాలలో శత్రువుల బలగాలకు సంబంధించిన కార్యకలాపాలను నిశితంగా పరిశీలించి.. ఫోటోలను పంపుతుంది. ఈ ఉపగ్రహంలో ఐదు ఇమేజింగ్ మోడ్స్ ఉంటాయి. చిన్న వస్తువులను గుర్తించేందుకు అల్ట్రా హై రిజల్యూషన్ ఇమేజింగ్ సిస్టమ్ కలిగి ఉంటుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ 1,710 కిలోల ఉపగ్రహాన్ని ఇస్రో పీఎస్ఎల్వీ సహాయంతో నింగిలోకి పంపనుంది.