Union Minister’s Granddaughter Murder : కేంద్రమంత్రి మనువరాలి దారుణ హత్య.. గన్‌తో కాల్చిచంపిన భర్త

Union Minister’s Granddaughter Murder : కేంద్ర మంత్రి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జితన్ రామ్ మాంఝీ మనువరాలు సుష్మాదేవి (32) దారుణ హత్యకు గురైంది. బిహార్‌లోని గయ జిల్లా అత్రి బ్లాక్ పరిధిలోని టెటువా గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆమె భర్తే కాల్చి చంపినట్లు అనుమానిస్తున్నారు.
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు..
వివరాల్లోకి వెళ్తే.. సుష్మ, ఆమె భర్త రమేశ్ మధ్య మనస్పర్థలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు. సుష్మాదేవి తన పిల్లలు, సోదరి పూనమ్‌కుమారితో కలిసి ఇంట్లో ఉన్న సమయంలో ఈ దారుణం జరిగింది. బుధవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చిన భర్త రమేశ్, సుష్మాదేవిల మధ్య గొడవ జరిగింది. భర్త రమేశ్ నాటు తుపాకీతో భార్యపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. వేరే గదితో ఉన్న పూనమ్.. సుష్మాదేవి పిల్లలు పరుగెత్తుకు వచ్చారు. వచ్చేసరికి రక్తపుమడుగులో పడి ఉన్న ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. సుష్మాదేవి అటారీ బ్లాకులో వికాస్ మిత్రాగా పనిచేస్తున్నారు. రమేశ్‌తో ఆమె పెళ్లి 14 ఏళ్ల కింద జరిగింది. దంపతులకు కృతి మాంఝీ అనే కూతురు ఉన్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు గయా ఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపారు.