Published On:

Kunjam Hidma : మావోయిస్టు కీల‌క నేత కుంజాం హిడ్మా అరెస్టు

Kunjam Hidma : మావోయిస్టు కీల‌క నేత కుంజాం హిడ్మా అరెస్టు

Another setback for the Maoist Party : మావోయిస్టు పార్టీకి మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. మావోయిస్టు అగ్ర‌నేత నంబాల కేశ‌వ‌రావు ఎన్‌కౌంట‌ర్ ఘ‌ట‌న మ‌రువ‌క ముందే మ‌రో కీల‌క నేత‌ను ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. ఛ‌త్తీస్‌గ‌ఢ్ బీజాపూర్ జిల్లాలోని జ‌న‌గూడ‌కు చెందిన కుంజాం హిడ్మాను అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఒడిశా పోలీసులు, డిస్ట్రిక్ట్ వాలంట‌రీ ఫోర్స్ బృందాలు ప్ర‌త్యేక ఆపరేష‌న్ చేప‌ట్టాయి. ఈ క్ర‌మంలో బోయిప‌రిగూడ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని పెట‌గూడ స‌మీపంలోని అడ‌వుల్లో హిడ్మాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రాంతంలో మావోలు సంచ‌రిస్తున్నార‌ని ప‌క్కా స‌మాచారం అంద‌డంతో పోలీసులు కూంబింగ్ నిర్వ‌హించిన‌ట్లు ఉన్న‌తాధికారులు పేర్కొన్నారు.

 

కూంబింగ్ నిర్వ‌హిస్తుండ‌గా పోలీసుల‌కు మావోలు తార‌స‌ప‌డ్డారు. దీంతో మావోయిస్టులు, పోలీసు బ‌ల‌గాల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు జరిగాయి. చాలామంది మావోలు అక్క‌డి నుంచి పారిపోయారు. మావోయిస్టు కుంజాం హిడ్మా మాత్రం అక్క‌డే ఉన్న చెట్ల పొద‌ల్లో త‌ల‌దాచుకున్నాడు. పోలీసులు అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. త‌ర్వాత హార్డ్‌కోర్ మావోయిస్టు హిడ్మా అని పోలీసుల విచార‌ణ‌లో తేలింది.

 

కుంజాం హిడ్మా ప్ర‌స్తుతం ఏరియా క‌మిటీ మెంబ‌ర్‌గా కొన‌సాగుతున్నారు. హిడ్మా నుంచి ఏకే 47 రైఫిల్, 35 రౌండ్ల బుల్లెట్లు, 27 ఎల‌క్ట్రానిక్ డిటోనేట‌ర్స్, 90 నాన్ ఎల‌క్ట్రిక్ డిటోనేట‌ర్స్, రెండు కేజీల గ‌న్ పౌడ‌ర్, రెండు స్టీల్ కంటైన‌ర్స్, రెండు రేడియోలు, ఒక ఇయ‌ర్ ఫోన్, వాకిటాకీ, బ్యాట‌రీ, 2 క‌త్తులు, గొడ్డ‌లి, 4 టార్చ్ లైట్లు, పాలిథీన్ క‌వ‌ర్ ల‌భించిన‌ట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టు సాహిత్యానికి సంబంధించిన పుస్త‌కాలు కూడా ల‌భించిన‌ట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: