TRS: నేడు టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.దసరా పండగ రోజున(అక్టోబర్ 5) మధ్యాహ్నం 1.19 గంటలకు కొత్త పార్టీని ప్రకటించనున్నారు.
TRS : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.దసరా పండగ రోజున(అక్టోబర్ 5) మధ్యాహ్నం 1.19 గంటలకు కొత్త పార్టీని ప్రకటించనున్నారు. అంతకుముందు తెలంగాణ భవన్‌లో సమావేశం కానున్న టీఆర్ఎస్ నాయకులు.. కొత్త పార్టీకి సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించనున్నారు. కొన్ని ప్రాంతీయ పార్టీల నేతలు కూడా ప్రారంభోత్సవానికి హాజరవుతారని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ఇక, టీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా మార్చనున్న కేసీఆర్.. పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) మార్చేందుకు రెడీ అయ్యారు. అయితే పార్టీ గుర్తుగా మాత్రం ‘‘కారు గుర్తు’’నే కొనసాగించనున్నారు. కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా బీఆర్ఎస్‌లో విలీనం అయ్యే అవకాశం ఉందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
ఈ నేపధ్యంలో సోమవారం మధ్యాహ్నం టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం కేసీఆర్ నిర్వహించనున్నారు. నియోజకవర్గ ఇంచార్జ్ లు, డివిజన్ అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు, టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై తీర్మానం చేసే అవకాశముందని తెలుస్తోంది. ఈ సమావేశంలో జాతీయ పార్టీ ఏర్పాటు, టీఆర్ఎస్ భవిష్యత్ గురించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఈ భేటీ తర్వాత పలు కీలక విషయాలు బయటకొచ్చే అవకాశాలున్నాయి.
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చి జాతీయ పార్టీగా ప్రకటించే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి పార్టీ నేతలందరూ కలిసి తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఈ తీర్మానం కాపీలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాల్సి ఉంటుంది. వీటిని సమర్పించి ఈసీకి దరఖాస్తు చేసుకుంటే జాతీయ పార్టీగా గుర్తిస్తూ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చనున్నారని ప్రచారం జరుగుతుండటంతో.. ఒకవేళ అదే జరిగితే ఇక టీఆర్ఎస్ పేరు రాష్ట్రంలో కనుమరుగు కానుంది.