Intermediate Exms : ఇంటర్ విద్యార్థులకు ఊరట.. నిమిషం ఆలస్యం నియామకం ఎత్తివేత

Intermediate Exms : ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. తెలంగాణలో మంగళవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిసారి విధించే ‘నిమిషం ఆలస్యం నియామాన్ని ఇంటర్మీడియట్ బోర్డు ఈసారి ఎత్తివేసింది. ఇంటర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగనున్నాయి. పరీక్షా కేంద్రాలకు ఉదయం 8.45 నిమిషాలకే చేరుకోవాలని అధికారులు సూచించారు. దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 4,88,448 మంది కాగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5, 08,523మంది విద్యార్థులు ఉన్నారు. 29,992 మంది ఇన్విజిలేటర్స్‌ను ఏర్పాటు చేశారు.
వందల మంది విద్యార్థులకు నష్టం..
అయితే ఏటా విధించే నిమిషం ఆలస్యం నియమం ప్రకారం.. పరీక్ష రాసే విద్యార్థులు ఉదయం 9 తర్వాత పరీక్షా కేంద్రాలకు నిమిషం ఆలస్యంగా చేరుకున్నా లోపలికి అనుమతి నిరాకరించేవారు. బోర్డు విధించిన నిబంధన వల్ల ప్రతి ఏటా వందల మంది విద్యార్థులు పరీక్ష రాయకుండా బాధతో వెనుదిరిగేవారు.
ప్రభుత్వంపై విమర్శలు..
పరీక్షకు ముందురోజు విద్యార్థులు పగలు రాత్రి నిద్ర మానుకొని ప్రిపేర్ అవుతారని, విద్యార్థులను నిమిషం ఆలస్యం కారణంగా లోపలికి నిరాకరించడం ఏమిటని తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రభుత్వాన్ని నిలదీసేవారు. ఈ నియామంపై విమర్శలు అధికం కావడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు 5 నిముషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేలా వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 1532 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్టు ఇంటర్ పరీక్షల బోర్డు వెల్లడించింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండనుంది.
జిరాక్స్ సెంటర్లు మూసివేత..
గతంలో పేపర్ లీకేజీ అయినట్లు విమర్శలు రావడంతో విద్యాశాఖ అప్రమత్తం అయింది. ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు అలర్ట్ అయ్యారు. ఇందులో భాగంగా పరీక్ష సమయంలో కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కెమెరాలన్నీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. ఏ కారణం చేతనైనా విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకపోతే కళాశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.