Published On:

Konda Murali: కాంగ్రెస్ పార్టీ అంటే గౌరవం ఉంది : కొండా మురళి

Konda Murali: కాంగ్రెస్ పార్టీ అంటే గౌరవం ఉంది : కొండా మురళి

Former MLC Konda Muarli: కాంగ్రెస్ పార్టీ అంటే తనకు గౌరవం ఉందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అన్నారు. శనివారం గాంధీభవన్‌లో క్రమ శిక్షణా కమిటీతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 15 పేజీలతో కూడిన నివేదికను కమిటీకి ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌తో కాంగ్రెస్‌ పార్టీపై తనకు అభిమానం పెరిగిందని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే తపన తనలో ఉందన్నారు. బహిరంగ విమర్శలు చేయడం మంచిదో చెడునో అంతరాత్మకు తెలుసన్నారు.

 

తాను బలహీనుడినా.. బలవంతుడినా అనేది అందరికీ తెలుసు అన్నారు. తనను రెచ్చగొట్టొద్దన్నారు. తాను రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కడియం రాజీనామా చేస్తారో లేదో అతడే తేల్చుకోవాలన్నారు. బీసీలను గౌరవించాలన్నారు. తాను దేనికి భయపడనని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ మహేశ్ కుమార్ గౌడ్ అంటే గౌరవం ఉందని చెప్పారు. మళ్లీ అవసరం వచ్చినప్పుడు వరంగల్‌లో మాట్లాడుతానని పేర్కొన్నారు.

 

కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో వివిధ జిల్లాల్లో నాయకుల మధ్య అంతర్గత పోరు కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఒకవర్గంగా, మిగిలిన ఎమ్మెల్యేలు మరోవర్గంగా విడిపోయి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు. సమస్యను పరిష్కరించే బాధ్యతను హైకమాండ్ క్రమశిక్షణా కమిటీకి అప్పగించింది. ఈ క్రమంలోనే ఇవాళ కొండా మురళి గాంధీభవన్‌కు వెళ్లి క్రమశిక్షణ కమిటీతో భేటీ అయ్యారు. కమిటీకి 15 పేజీలతో కూడిన నివేదికను అందజేశారు. గతంలో మురళి చేసిన వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ వివరణ కోరిన సందర్భంగా 15 పేజీల లేఖను సమర్పించినట్లు తెలుస్తోంది.

 

ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డిపై కొండా మురళి క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేశారు. ఉమ్మడి వరంగల్‌లో ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్న అంశాలపై నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. కడియం, రేవూరి, నాయినిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మురళి కోరారు. క్రమశిక్షణా కమిటీ ముందు హాజరయ్యేందుకు వచ్చిన మురళీకి మద్దతుగా భారీగా అనుచరులు వచ్చారు. వారిని గాంధీ భవన్ గేటు వద్ద పోలీసులు నిలిపివేశారు.

ఇవి కూడా చదవండి: