Published On:

Harish Rao: ఇది జాబ్ క్యాలెండర్ కాదు.. జాబ్ లెస్ క్యాలెండర్ : హరీశ్‌రావు హాట్‌కామెంట్స్

Harish Rao: ఇది జాబ్ క్యాలెండర్ కాదు.. జాబ్ లెస్ క్యాలెండర్ : హరీశ్‌రావు హాట్‌కామెంట్స్

Harish Rao Comments on Congress Government: రేవంత్‌రెడ్డి జాబ్ క్యాలెండర్లో చెప్పిన ఒక్క జాబ్ ఇవ్వలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు.. జాబ్ లెస్ క్యాలెండర్ అని ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్‌లో నిరుద్యోగ యువతతో ముఖాముఖిలో పాల్గొని మాట్లాడారు. యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని నిరుద్యోగులు వచ్చి తమను కలిశారని తెలిపారు. చలో సెక్రటేరియట్ చేపడుతున్నామని, దానికి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలని కోరారు. తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని నిరుద్యోగులకు హరీశ్‌రావు హామీనిచ్చారు.

 

బీఆర్ఎస్ హయాంలో దాదాపు లక్ష అరవై వేల ఉద్యోగాలు వేశామన్నారు. కానీ, రేవంత్ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారని, ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్‌లో చెప్పిన ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇవ్వాలని అడిగితే అసెంబ్లీని వాయిదా వేసుకొని వెళ్లారని గుర్తుచేశారు. మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, 20 నెలల్లో 12 వేల ఉద్యోగాలకు మించి ఇవ్వలేదన్నారు.

 

విద్యార్థులు నోటిఫికేషన్లు వద్దని అన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెబుతుందని మండిపడ్డారు. సరూర్‌నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ విడుదల చేశారని, ఇందిరా గాంధీ మనుమరాలిగా మాట్లాడుతున్నాను అని చెప్పిన ప్రియాంక ఇప్పుడు ఎటు పోయింది అని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ దగా క్యాలెండర్ లాగా మారిపోయిందని మండిపడ్డారు. 60వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న రేవంత్ వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాము చదువుకునే దగ్గరకు వచ్చి కాంగ్రెస్‌కు ఓట్లు వేయమని కోదండరాం, మురళి, రియాజ్ చెప్పారని విద్యార్థులు చెప్పుకొచ్చారు. ప్రియాంక గాంధీతో పాటు విద్యార్థులకు దొంగ మాటలు చెప్పిన వాళ్లకు ఉద్యోగాలు వచ్చాయి. కానీ, విద్యార్థులకు మాత్రం ఉద్యోగాలు రాలేదని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి: