Telangana BJP: జూలై 1న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి ఎన్నిక

BJP State President: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. అధ్యక్షుడి ఎన్నికకు ఆదివారం ఉదయం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. సోమవారం పదవికి పోటీ పడుతున్న అశావహుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లుగా బీజేపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ వెల్లడించారు. జులై 1వ తేదీన ఎన్నికలు నిర్వహించి అధ్యక్షుడిని ఎన్నుకుంటారని, అదేరోజు అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు.
నలుగురి మధ్య పోటీ..
బీజేపీ అధ్యక్ష పదవి కోసం పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. పలువురు నేతలు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ మొదలు పెట్టారు. పోటీలో ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్, ధర్మపురి అర్వింద్ ఉన్నట్లుగా బీజేపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌కి మళ్లీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పోటీలు ఉన్న నేతలంతా బయటకు తాము రేసులో లేమని చెబుతున్నా లోలోపల పదవి కోసం తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తోందోనని బీజేపీ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా అధిష్ఠానం అధ్యక్షుడి ఎన్నికను సీరియస్‌గా తీసుకున్నట్లుగా సమాచారం.
అధికారంలోకి రావడమే లక్ష్యం..
లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 8 సీట్లు కైవసం చేసుకుంది. తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటారు. పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు స్ఫూర్తితో రాబోయే స్థానిక ఎన్నికల సమారానికి సమాయత్తం అవుతున్నారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే బూత్ లెవల్ నుంచి రాష్ట్రస్థాయి కమిటీల నియామకాలను పూర్తిచేశారు. మరోవైపు తెలంగాణ బీజేపీ అధినాయకత్వం పార్టీ తరఫున వరుసగా వర్క్‌షాప్‌లను నిర్వహిస్తోంది. ప్రజాసంక్షేమం కోసం కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ర్టంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా అధిష్ఠానం పక్కాగా యాక్షన్ ప్లాన్ రూపొందించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.