Published On:

Kartik Maharaj: ఉద్యోగం ఇప్పిస్తానని అత్యాచారం.. నిందితుడు పద్మ అవార్డు గ్రహీత

Kartik Maharaj: ఉద్యోగం ఇప్పిస్తానని అత్యాచారం.. నిందితుడు పద్మ అవార్డు గ్రహీత

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో వరుసగా అత్యాచార ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల కోలకతాలోని ఆర్జీకర్‌లో వైద్యురాలి హత్యాచార ఘటన మరువకముందే తాజాగా లా స్టూడెంట్‌ను సామూహిక అత్యాచారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపణలు చేసింది. నిందితుడు ఇటీవల పద్మశ్రీ అవార్డు అందుకున్న స్వామీ ప్రదీప్తానంద కావడం గమనార్హం.

 

2012లో చనక్‌ ఆదివాసీ అబాసిక్‌ బాలిక విద్యాలయంలో ఉద్యోగం కోసం ప్రదీప్తానందను కలిసింది. తనకు ఉద్యోగం ఇస్తానని హామీనిచ్చారని ఓ మహిళ పేర్కొన్నారు. 2013లో ఉద్యోగం తర్వాత ఇస్తామని పాఠశాలలోని ఓ హాస్టల్‌లో వసతి కల్పించారని తెలిపారు. ఆ సమయంలోనే తనపై అత్యాచారం జరిగిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తాను గర్భం దాల్చగా, పాఠశాలలోని పలువురు సిబ్బంది కలిసి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి తనకు బలవంతంగా అబార్షన్‌ చేశారని పేర్కొన్నారు. తర్వాత కూడా ఉద్యోగం ఇవ్వలేదని, పైగా అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వెల్లడించారు.

 

ఇటీవల అతడిని కలిసేందుకు ప్రయత్నించినట్లు ఆమె తెలిపారు. ప్రదీప్తానంద అనుచరులు కొందరు తనను బెదిరించారని తెలిపారు. ఆయన్ను కలిసే ఆలోచన వదులుకోవాలని హెచ్చరించారని పేర్కొన్నారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఫిర్యాదుపై ప్రదీప్తానంద స్పందించారు. ఆరోపణలను ఖండించారు. కాలం అన్నింటినీ బయటపెడుతుందని చెప్పారు. తన పేరు, ప్రతిష్ఠలను చెడగొట్టడానికి చేసిన కుట్ర అన్నారు. తమ ఆశ్రమంలో చాలామంది మహిళలు పనిచేస్తున్నారని, మహిళా శిష్యులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఇక్కడ ఉన్న వారిని అడాలని కోరారు. మహిళలను తాము మాతృ సమానంగా గౌరవిస్తామని ఆయన ఓ వార్తా సంస్థతో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: