Published On:

TG SC Sub-Categorization: ఎస్సీ వర్గీకరణ జీఓ రిలీజ్.. నేటి నుంచే అమల్లోకి..

TG SC Sub-Categorization: ఎస్సీ వర్గీకరణ జీఓ రిలీజ్.. నేటి నుంచే అమల్లోకి..

Telangana Government to Release GO SC Classification: ఎస్సీ వర్గీకరణ జీఓను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో నేటి నుంచి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలులోకి రానుంది. అంతకుముందు దీనికి సంబంధించిన బిల్లును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అమోదించారు. ఇదిలా ఉండగా, ఎస్సీ వర్గీకరణపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

 

మొత్తం 59 ఎస్సీ ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించింది. అనంతరం ‘ఏ’ గ్రూపులో ఉన్న వారికి 1 శాతం, గ్రూపు ‘బీ’లో ఉన్న వారికి 9 శాతం, గ్రూపు ‘సీ’లో ఉన్న వారికి 5 శాతం చొప్పున రిజర్వేషన్లు కేటాయించింది. కాగా, ఎస్సీ వర్గీకరణ జీఓను తెలుగుతో పాటు ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.

 

అయితే, ప్రభుత్వ ఉద్యోగాలను తొలుత గ్రూప్ 1లోని కులాల వారితో భర్తీ చేయనున్నారు. ఇక్కడ మిగిలిన ఉద్యోగాలు గ్రూప్ 2లో ఉన్న కులాల వారితో భర్తీ చేస్తారు. ఆ తర్వాత చివరికి గ్రూప్ 3లో ఉన్న అభ్యర్థులతో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఒకవేళ మూడు గ్రూపుల్లోనూ అభ్యర్థులు లేని సమక్షంలో ఆ ఖాళీలను క్యారీ ఫార్వర్డ్ చేయనున్నారు.

 

అలాగే, గ్రూప్ 1 లో ఉన్న అభ్యర్థులకు 7వ రోస్టర్ పాయింట్ ఇవ్వగా.. గ్రూప్ 2 లో ఉన్న వారికి 2, 16, 27,47, 52, 66, 72, 87, 97వ రోస్టర్ పాయింట్లు, గ్రూప్ 3లో ఉన్న అభ్యర్థులకు 22, 41, 62, 77, 91 రోస్టర్ పాయింట్లు ఉండనున్నాయి.

 

అంతేకాకుండా, గ్రూప్ 1లో సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా వెనుకబడిన 15 కులాలను చేర్చి 1 శాతం రిజర్వేషన్ కల్పించింది. గ్రూప్ 2లో మాదిగ, దాని ఉపకులాల 18లకు 9 శాతం, గ్రూపు 3లో మాల, దాని ఉపకులాల 26లకు 5 శాతం కేటాయించింది. గ్రూప్ 3లో మాల, దాని ఉపకులాల 26లకు 5 శాతం కేటాయించింది. ఇప్పటివరకు గ్రూప్ 1లో 1,71,625 మంది ఉండగా జనాభాలో 3.288 శాతం, గ్రూప్ 2 లో 32,74,377 మంది ఉండగా, 62.749 శాతం, గ్రూప్ 3 లో 17,71,682 ఉండగా, జనాభాలో 33.963శాతం మంది ఉన్నారు.

 

ఇదిలా ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగానే ఏప్రిల్ 14న ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఉపకులాలను 3 గ్రూపులుగా విభజిస్తూ జీఓ విడుదల చేసింది. ఇందులో భాగంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలోని ట్యాంకు బండ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.