Published On:

TPCC Chief Mahesh Kumar Goud : కంచ గచ్చిబౌలి భూములపై దమ్ముంటే చర్చకు రా.. కేటీఆర్‌కు మహేశ్ కుమార్ గౌడ్ సవాల్

TPCC Chief Mahesh Kumar Goud : కంచ గచ్చిబౌలి భూములపై దమ్ముంటే చర్చకు రా.. కేటీఆర్‌కు మహేశ్ కుమార్ గౌడ్ సవాల్

TPCC Chief Mahesh Kumar Goud : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న రాద్ధాంతంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ నగరంలో బంగారం లాంటి భూములను గతంలోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్ముకున్న విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను సొంత నేతలకే అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ రోజు హైదరాబాద్‌లో కొండలను కూడా కరిగించి పనులు జరుగుతున్నాయని, ఆ భూములను అమ్మింది ఎవరు అని నిలదీశారు.

 

పదేళ్లలో భూములు మాయం..
పదేళ్లలో హైదరాబాద్ భూములను మాయాజాలం చేసి ఎకరా రూ.100 కోట్లకు అమ్ముకున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో హైదరాబాద్‌లోనే 10 వేలకుపై చిలుకు భూములను అడ్డగోలుగా అమ్ముకున్నారని వ్యాఖ్యానించారు. యూనివర్సిటీ భూముల విషయంలో కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, వాజ్‌పేయి హయాంలో యూనివర్సిటీ భూములను ఐఎంజీ భరత్ అనే సంస్థకు చెందిన బిల్లీరావుకు అమ్మారని తెలిపారు.

 

ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్‌రెడ్డి పోరాటం చేయగా, ఆ భూములు ప్రభుత్వానికి దక్కాయని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ సెంట్రల్ యూనివర్సిటీ భూములతోపాటు పలు యూనివర్సిటీలకు చెందని భూములను దోచుకోవాలని చూశారని తెలిపారు. ఐఎంజీ భరత్ సంస్థతో 33 శాతం ముడుపులు తీసుకునేలా కేటీఆర్ మాట్లాడుకున్నారని తెలిపారు. కేటీఆర్‌కు రావాల్సిన ముడుపులు రూ.5,200 కోట్లను కాంగ్రెస్‌కు అంటగడ్డే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

 

కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే రూ.5,200 కోట్లు తీసుకుని యూనివర్సిటీ భూములను బిల్లీరావుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పన్నంగా అప్పగించేదని పేర్కొన్నారు. యూనివర్సిటీ భూములు ప్రభుత్వానివని, ఇందుకు బదులుగా 390 ఎకరాలు అప్పట్లో కాంగ్రెస్ ఇచ్చిందని గుర్తుచేశారు. యూనివర్సిటీ భూములను కాపాడింది రాజశేఖర్ రెడ్డి అన్నారు. వెనక్కి తీసుకొచ్చింది సీఎం రేవంత్‌రెడ్డి అని వ్యాఖ్యానించారు. పదేళ్ల భూ దోపిడీపై దమ్ముంటే చర్చకు రావాలని కేటీఆర్‌కు మహేశ్ కుమార్ గౌడ్ సవాల్ చేశారు.

 

 

ఇవి కూడా చదవండి: