Narendra Modi: తెలుగు రాష్ట్రాల మధ్య రెండో వందే భారత్.. ప్రారంభించిన ప్రధాని
ప్రయాణికుల నుంచి డిమాండ్ భారీగా ఉండటంతో రైల్వేశాఖ సికింద్రాబాద్-తిరుపతిల మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.
Narendra Modi: తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కింది. ఈ హైస్పీడ్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు. హైటెక్ హంగులతో రూపుదిద్దుకున్న ఈ రైలు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రారంభోత్సవంలో రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఉన్నారు.
ప్రారంభోత్సవం సందర్భంగా ఈ రైలులో కొంతమంది విద్యార్థులు నల్గొండ వరకు ప్రయాణిస్తున్నారు. అంతకుముందు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ప్రధాని వందేభారత్ రైలు ఎక్కారు. అక్కడ ఉన్న విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం జెండా ఊపి రైలును ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం చేర్యాల పెయింటింగ్‌ను రైల్వే శాఖ మంత్రి ప్రధానికి బహుకరించారు.
ప్రధానికి ఘన స్వాగతం(Narendra Modi)
ప్రధాని హైదరాబాద్ లో పర్యటనలో ఉదయం 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమర్ స్వాగతం పలికారు. బేగంపేట నుంచి మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా దళాలు అడుగడుగునా పహారా నిర్వహించాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ప్రారంభించిన తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్-విశాఖపట్నంల నడుమ నడుస్తోంది. ఈ ట్రైన్ కి మంచి ఆదరణ లభిస్తోంది. హైదరాబాద్ నుంచి తిరుపతికి నిత్యం వేల సంఖ్యలో శ్రీవారి భక్తులు ప్రయాణిస్తుంటారు. తిరుమల వెళ్లే భక్తులకు మూడు నాలుగువారాల ముందు ప్రయత్నిస్తే తప్ప రిజర్వేషన్ దొరికే పరిస్థితి లేదు. ఈ క్రమంలో ప్రయాణికుల నుంచి డిమాండ్ భారీగా ఉండటంతో రైల్వేశాఖ సికింద్రాబాద్-తిరుపతిల మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.
ట్రైన్ టైమింగ్స్ ఇలా..
సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే (20701) రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉదయం 6 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అదే విధంగా తిరుపతి-సికింద్రాబాద్ (20702) రైలు తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరి రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రూట్ లో మంగళవారం తప్ప మిగిలిన రోజుల్లో వందేభారత్ నడుస్తుంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ఉంచిన దానిప్రకారం ఈ రైలులో టికెట్ల ధరలు..
సికింద్రాబాద్ నుంచి తిరుపతి ఏసీ ఛైర్‌కార్ టికెట్ ధర రూ. 1680, ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ టికెట్ ధరను రూ. 3080 లుగా నిర్ణయించారు. అదే, తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ఏసీ ఛైర్‌కార్ టికెట్ ధర రూ. 1625, ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ టికెట్ ధరను రూ.3030లుగా పేర్కొన్నారు.
ఛైర్‌కార్ లో సికింద్రాబాద్ నుంచి ఛార్జీలు
సికింద్రాబాద్ నుంచి నల్గొండ – రూ. 470
సికింద్రాబాద్ నుంచి గుంటూరు – రూ. 865
సికింద్రాబాద్ నుంచి ఒంగోలు – రూ.1075
సికింద్రాబాద్ నుంచి నెల్లూరు – రూ.1270
సికింద్రాబాద్ నుంచి తిరుపతి – రూ.1680
ఎగ్జిక్యూటివ్ ఛార్జీలు
సికింద్రాబాద్ నుంచి నల్గొండ – రూ. 900
సికింద్రాబాద్ నుంచి గుంటూరు – రూ.1620
సికింద్రాబాద్ నుంచి ఒంగోలు – రూ. 2045
సికింద్రాబాద్ నుంచి నెల్లూరు – రూ. 2455,
సికింద్రాబాద్ నుంచి తిరుపతి -రూ. 3080