Last Updated:

Telangana : గుహలో బండరాళ్ళ మధ్య ఇరుక్కున్న యువకుడు.. 40 గంటలుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Telangana : గుహలో బండరాళ్ళ మధ్య ఇరుక్కున్న యువకుడు.. 40 గంటలుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Telangana : స్నేహితుడితో కలిసి వేటకు వెళ్ళిన వ్యక్తి అనుకోని రీతిలో గుహలో ఇరుక్కుపోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాగా డిసెంబర్ 13 వ తేదీ సాయంత్రం సమయంలో ఈ ఘటన జరగగా… ఇప్పటికీ కూడా అతన్ని బయటికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. దాదాపు 40 గంటలకు పైగా రాళ్ళ మధ్యలో ఆ వ్యక్తి ఇరుక్కుని నరకయాతన అనుభవిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా తలక్రిందులుగా ఉన్న పరిస్థితుల్లో రాళ్ళ మధ్యలో ఇరుక్కుని ఉన్న అతన్ని చూసి వారి కుటుంబ సభ్యులు విలవిల్లాడిపోతున్నారు. ఆ వ్యక్తిని ప్రాణాలతో కాపాడడానికి రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తుంది.

ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో చోటు చేసుకుంది. డిసెంబర్‌ 13వ తేదీన కామారెడ్డి రెడ్డిపేట గ్రామానికి చెందిన షాడ రాజు ఘన్‌పూర్‌ శివారులో అటవీ ప్రాంతానికి వేటకు వెళ్లాడు. అక్కడే ఉన్న ఒక గుహలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అనుకోకుండా తన సెల్‌ఫోన్‌ కింద పడిపోవడంతో దానిని తీసేందుకు ప్రయత్నించడంతో గుహలో మరింత లోతుకు వెళ్లి ఇరుక్కుపోయాడు. ఆ సమయంలో అతడితో పాటు మహేష్ అనే అతని మిత్రుడు కూడా తోడుగా ఉన్నట్లు తెలుస్తుంది. మంగళవారం ఎంత ప్రయత్నించినా రాజు బయటకు రాలేకపోవడంతో… మహేష్, కొందరు గ్రామస్థులు బుధవారం నాడు వరి ప్రయత్నాలు చేసి అతన్ని బయటికి తీసేందుకు యత్నించారు. కానీ ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.

కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ … 

విషయన్ని తెలుసుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీల సాయంతో రాళ్లను తొలగించేందుకు నిన్న మధ్యాహ్నం నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు నడుము కింది భాగం అంతా రాళ్ళ మధ్యలో ఇరుక్కుపోవడంతో అతణ్ని బయటకు తీయడం ఇబ్బందిగా మారింది. జేసీబీలు, కంప్రెషర్లు సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేసినప్పటికీ నిన్న రాజును బయటకు తీయలేకపోయారు. చీకటి పడుతుండటంతో అక్కడికి సహాయక చర్యలు నిలిపివేశారు. కాగా ఈరోజు తెల్లవారుజాము నుంచి మళ్లీ సహాయక చర్యలు ప్రారంభించారు.

వీలైనంత త్వరగా రాజుని ప్రాణాలతో బయటకు రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తుంది. తాజాగా బండరాళ్లను పేల్చేందుకు బాంబును కూడా పెట్టారు. అయితే బాంబ్ బ్లాస్ట్ లో అతనికి ఎటువంటి హాని జరగలేదని వైద్యులు నిర్ధారించారు. మరోవైపు రాజు తలక్రిందులుగా ఎక్కువ సేపు ఉండడం కూడా మంచిది కాదని డాక్టర్లు సూచిస్తున్నారు. అతన్ని ఎలా అయిన కాపాడి ప్రాణాలతో బయటికి తీయండని వారి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కోరుతున్నారు.

ప్రశ్నార్ధకంగా ఆరోగ్యం … 

దాదాపు 40 గంటలు గడుస్తున్న తరుణంలో నిద్ర, ఆహారం లేకుండా అతని ఆరోగ్యం క్షీణిస్తుందని భావిస్తున్నారు. రాజుని సాధ్యమైనంత త్వరగా బయటకు ప్రాణాలతో రావాలని అందరూ కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి: