Kaleshwaram: నేటి నుంచి సరస్వతీ పుష్కరాలు ప్రారంభం

kaleshwaram: జయశంకర్ భూపాల పల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద సరస్వతీ నదిలో నేటి నుంచి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. బృహస్పతిలోకి మిథున రాశిలో ప్రవేశిస్తుండటంతో సరస్వతీ నదికి పుష్కరాలు మొదలవుతాయని పండితులు తెలిపారు. కాళేశ్వరాలయం నుంచి మంగళ వాయిద్యాలతో నదికి వెళ్లి గణపతి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ముందుగా నదిలో నీటికి పంచ కలశాలలో ఆవాహన పూజ నిర్వహిస్తారు. పుష్కరునికి చీర, సారెతో ఒడి బియ్యం, పూలు, పండ్లు సమర్పిస్తారు. తర్వాత భక్తులందరూ పుష్కర సంకల్ప స్నానం చేస్తారు.
12సంవత్సరాల తర్వాత సరస్వతీ పుష్కరాలు జరుగనున్నాయి. గురువారం ఉదయం తోగుట ఆశ్రమం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతిగారు పుష్కర స్నానాలను ప్రారంభిస్తారు. సాయంత్రం 5గంటలకు సీఎం రేవంత్ రెడ్డి పుష్కరస్నానం ఆచరిస్తారు. అనంతరం కాశీపండితులచే నిర్వహించబడే హారతిలో పాల్గొంటారు.
12రోజులపాటు జరిగే ఈ పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది. రోజుకు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తలు వస్తారని అంచని వేస్తున్నారు. భక్తులకొరకు సరస్వతి పుష్కరాలకు సమీపంలో తాత్కాలిక బస్ స్టేషన్ ను ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాలనుంచి వచ్చే ప్రైవేట్ వెహికిల్స్ కోసం 8పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేశారు. ప్రతీరోజు సరస్వతి ఘాట్ లో నవరత్నమాల హారతి ఉంటుంది. భక్తులు బసచేసేందుకు వీలుగా తాత్కాలిక టెంట్ సిటీని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. పుష్కరాల నిర్వహణకు రూ.35కోట్లను కెటాయించారు.
గురువారం సాయంత్రం కాలేశ్వరంకు చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు. సాయంత్రం 5గంటలకు పుష్కరస్నానం చేసిన తర్వాత శ్రీకాళేశ్వర, ముక్తీశ్వర స్వామి వార్లను దర్శించుకుంటారు. అనంతరం 10అడుగుల సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. పుష్కరాల నేపథ్యంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. సరస్వతీ నది పుష్కరాల పోస్టర్ ను ఆవిష్కరించారు.

minister koda sureka sarasawati pushkaralu 2025