Published On:

Adilabad: పాఠశాల విద్యార్థులపై విష ప్రయోగం.. నీటిలో పురుగుల మందు ఎందుకు కలిపావ్ రా!

Adilabad: పాఠశాల విద్యార్థులపై విష ప్రయోగం.. నీటిలో పురుగుల మందు ఎందుకు కలిపావ్ రా!

Poisoning Attempt in Adilabad government school drinking water: ఆదిలాబాద్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులపై విష ప్రయోగం జరిగింది. ఇచ్చోడలోని ధర్మపురి ప్రభుత్వ పాఠశాల వంట రూంలోని నీటిలో పురుగుల మందు కలిపినట్లు తేలింది. దీంతో పాటు విద్యార్థులు వినియోగించే నీటిలోనూ పురుగుల మందు చల్లారు. ఇలా విష ప్రయోగం చేసిన తర్వాత ఆ పురుగుల మందు డబ్బాను అక్కడే పాడేయడం గమనార్హం. అయితే, పాఠశాల తెరిచిన తర్వాత టీచర్లు ముందే గుర్తించడంతో 30 మంది విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. అనంతరం పోలీసులకు హెడ్మాస్టర్ ఫిర్యాదు చేశారు.

 

సమాచారం అందిన వెంటనే పోలీసులు ధర్మపురి పాఠశాలను తనిఖీ చేశారు. అనంతరం వివరాలు సేకరించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మపురి ఎంపీపీ పాఠశాలకు ఏప్రిల్ 13, 14వ తేదీల్లో సెలవులు ప్రకటించారు. ఈ సమయంలోనే తాళాలు పగులగొట్టి విష ప్రయోగం జరిగిందని పోలీసులు గుర్తించారు. అయితే తొలుత టీచర్లు పాఠశాలకు వచ్చేసరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఆ తర్వాత లోపలికి వెళ్లి చూడగా.. బకెట్‌లో నీళ్లు తెలుపు రంగులో కనిపించాయి. దీంతో స్థానిక సర్పంచ్, పెద్దలకు సమాచారం అందించారు.

 

గ్రామస్తులతో కలిసి సర్పంచ్ పాఠశాలను పరిశీలించగా పురుగుల మందు కలిపినట్లు అనుమానం వ్యక్తం చేశారు. హెడ్మాస్టర్ ఫిర్యాదు మేరకు ఇచ్చోడ పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే ఏఎస్పీ కాజల్ సింగ్, సీఐ భీమేశ్ రంగంలోకి దిగి తనీఖీలు నిర్వహించారు. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిపై అనుమానంతో వివరాలు సేకరించారు. వెంటనే సోయం కిస్టును అదుపులోకి విచారించగా.. నిర్మల్ జిల్లాలో పురుగుల మందు తీసుకొచ్చి కలిపినట్లు ఒప్పేసుకున్నాడు. అయితే కుటుంబ కలహాల కారణంగానే నిందితుడు మానసిక పరిస్థితి సరిగా లేదని తేలిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితుడిపై 324(6) 329(4), 331(8), 332 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.