Last Updated:

Pasala Krishna Bharathi : గాంధేయవాది పసల కృష్ణభారతి కన్నుమూత

Pasala Krishna Bharathi : గాంధేయవాది పసల కృష్ణభారతి కన్నుమూత

Pasala Krishna Bharathi : గాంధేయవాది పసల కృష్ణభారతి (92) ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్ స్నేహపురి కాలనీలోని తన నివాసంలో కన్నుమూశారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతుల రెండో కుమార్తె కృష్ణభారతి. జీవితాంతం గాంధేయవాదిగా ఉన్నారు. గాంధీజీ ప్రవచించిన విలువలతోనే ఆమె జీవించారు. పలు విద్యాసంస్థలకు నిధులు అందజేశారు. దళితుల్లో విద్యావ్యాప్తికి ఆమె ఎనలేని కృషిచేశారు. గోశాలలకు విరాళాలు కూడా సమకూర్చారు. అవివాహితగా ఉన్న కృష్ణభారతికి నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెళ్లు. 2022 జూలైలో భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కృష్ణభారతిని ప్రధాని మోదీ సత్కరించారు. ఆమెకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు.

 

 

బ్రిటిష్ ప్రభుత్వం పెట్టిన తీవ్ర ఆంక్షలను ధిక్కరించి భీమవరం సబ్ కలెక్టర్ కార్యాలయంపై జెండా ఎగురవేయగా, ఈ ఘటనలో కృష్ణమూర్తి దంపతులకు 1932 జూన్‌లో కఠిన కారాగారవాసం విధించారు. ఘటన సౌత్ బార్డోలీ తిరుగుబాటుగా పేరు పొందింది. జైలు శిక్ష విధించిన సమయంలో అంజలక్ష్మి 6 నెలల గర్భిణి. అయినా ఆమె పట్ల బ్రిటిష్ ప్రభుత్వం కనికరించలేదు. జైలులోనే ఆమెకు కృష్ణభారతి జన్మించారు. కారాగారంలో జన్మించిన శ్రీకృష్ణుడిని, స్వతంత్ర భారతి ఆకాంక్షను గుర్తుచేస్తూ ఆమెకు తల్లిదండ్రులు కృష్ణభారతి అని పేరుపెట్టారు. ఆమె తొలి పది నెలల బాల్యం కారాగారంలో గడిచింది.

 

 

పడమర విప్పర్రు గ్రామంలోని తమ ఆస్తిని స్వాతంత్ర్య పోరాటం కోసం కృష్ణమూర్తి దంపతులు త్యాగం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో గాంధీజీ పర్యటన సమయంలో కృష్ణమూర్తి ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. వినోబాభావే భూదానోద్యమంలో పాలుపంచుకుని స్వగ్రామంలో దళితులకు ఇళ్ల పట్టాలు ఇప్పించారు. జీవితాంతం కుష్టు రోగులు, అభాగ్యులకు సేవ చేశారు. చివరి వరకు గాంధేయ విలువలతో ఆమె జీవించారు.

ఇవి కూడా చదవండి: