Published On:

CM Revanth Reddy : పదేళ్లు తెలంగాణకు చంద్రగ్రహణం : సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy : పదేళ్లు తెలంగాణకు చంద్రగ్రహణం : సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy : తెలంగాణలో మహిళల సమగ్ర వికాసమే ధ్యేయంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం మహిళా శక్తి పథకం కింద పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలోనే తొలిసారి మహిళా సంఘాల నిధుల ద్వారా ఆర్టీసీ అద్దె బస్సులను ముఖ్యమంత్రి రేవంత్‌ ఇవాళ ప్రారంభించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొలి విడతలో 150 ఆర్టీసీ అద్దె బస్సులకు సీఎం పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.

మహిళా సంఘాల స్టాళ్ల సందర్శన
మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన వివిధ ఉత్పత్తుల స్టాళ్లను మంత్రులు సీతక్క, పొన్నం తదితరులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించారు. మహిళా పెట్రోల్ బంకుల నమూనాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించబోయే సోలార్ ప్లాంట్ల నమూనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోజుకు రూ.15 వేల వ్యాపారం జరుగుతోందని నిర్వాహకులు ముఖ్యమంత్రికి వివరించారు.

ఆడబిడ్డల ఆశీర్వాదంతో..
ఆడబిడ్డల ఆశీర్వాదంతో రాష్ట్రంలో చంద్ర గ్రహణం తొలగిపోయిందన్నారు. ఏ మార్పు కావాలని ఆడబిడ్డలు ఆశీర్వదించారో ఆ మార్పు ఇప్పుడు పరేడ్‌ గ్రౌండ్‌లో కనిపిస్తోందన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తేనే తెలంగాణ 1 ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థ అవుతుందని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించామన్నారు. ఆడబిడ్డలు తలచుకుంటే 1 ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థ సాధన పెద్ద కష్టం కాదన్నారు.

జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు..
65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారని, పాఠశాలల నిర్వహణ, బడి పిల్లలకు కోటి 30 లక్షల జతల యూనిఫాం కుట్టించే పని మహిళలకే అప్పగించామన్నారు. జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు కేటాయించామన్నారు. సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి మహిళా సంఘాలకు ఇచ్చామన్నారు. ఆర్టీసీలో వెయ్యి ఎలక్ట్రిక్‌ బస్సులకు యజమానులు అవుతున్నారని సంతోషం వ్యక్తంచేశారు. మహిళల సంక్షేమం, అభివృద్ధికి సీతక్క, కొండా సురేఖ పనిచేస్తున్నారని, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఉండాలని సోనియా కృషి చేశారని గుర్తుచేశారు. ఇందిరాగాంధీని అమ్మా అన్నారని, ఎన్టీఆర్‌ను అన్నా అన్నారని, తనను రేవంతన్న అంటున్నారని గుర్తుచేశారు. మీతో పేగుబంధం కలిగిన అన్నగా మాట ఇస్తున్నా.. మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తానని హామీనిచ్చారు.

ఇవి కూడా చదవండి: