T-Congress on Prabhakar Reddy: దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్!

Congress Strong Counter to Kotha Prabhakar Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు సర్కారును పడగొట్టాలంటున్నారని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును తానే భరిస్తామంటున్నారని, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారని ఆరోపించారు. మరోవైపు బిల్లులు రాకపోవడంతో సర్పంచ్‌లు లబోదిబోమంటున్నారని, తెలంగాణ వచ్చేంది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన జోస్యం చెప్పారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు స్పష్టిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నేతలు స్పందించారు. మంగళవారం సీఎల్పీ సమావేశానికి ముందు నోవాటెల్ వద్ద పలువురు కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడారు.
ఇందిరమ్మ ప్రభుత్వానికి ప్రజల మద్దతు: పొంగులేటి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి, ఇందిరమ్మ ప్రభుత్వానికి ప్రజలు మద్దతిచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ సర్కారును పడగొట్టాలని పలువురు కోరుతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన వారం నుంచి అధికార దాహంతో కూల్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
తెలంగాణలో పార్టీలు, మతాలు, కులాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని సర్కారు నిర్ణయించిందని మంత్రి పొంగులేటి తెలిపారు. అర్హులందరికీ సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై జీవోను విడుదల చేశామన్నారు. భూ భారతి చట్టం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. గతంలో అక్రమంగా భూములు కొల్లగొట్టారని ఆరోపించారు. అక్రమ భూములను భూ భారతి పోర్టర్ ద్వారా ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందని స్పష్టం చేశారు. అందుకే ప్రభాకర్‌రెడ్డి భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. కేసీఆర్ సూచన మేరకే కొత్త వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. కంచ గచ్చిబౌలి 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. భూ భారతితో పేదల ఆస్తులను తిరిగి పేదలకు పంచుతామన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలుస్తామని పగటి కలలు కంటున్నారని ఆరోపించారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి కేసీఆర్ ఆత్మ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మొదటి నుంచి కుట్రలు జరుగుతున్నాయని, వెంటనే ముఖ్యమంత్రి అయిపోవాలని తండ్రి, కుమారుడు చూస్తున్నారని పొంగులేటి వ్యాఖ్యానించారు.
మాటల వెనుక కుట్ర కోణం: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ప్రభాకర్‌రెడ్డి మాటలు వెనుక కుట్ర కోణం ఉందన్నారు. ఇలాంటి చోటా మోటా వ్యాఖ్యలకు భయపడేది లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజా బలం ఉందని స్పష్టం చేశారు.
కుట్రకోణంగా భావిస్తున్నాం: ఆది శ్రీనివాస్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఖండించారు. కాంగ్రెస్ సర్కారును పడగొట్టాలనే కుట్ర పన్నుతున్నారని తెలిపారు. ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరతామని చెప్పారు. కుట్రకోణం ఉన్నట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
నార్కో టెస్ట్ చేయించాలి: అద్దంకి దయాకర్
దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డికి నార్కో ఎనాలసిస్ టెస్ట్ చేయించాలని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. విచారణ చేయించి, నిజాలు చెప్పించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. బీజేపీతో కలిసి గుజరాత్ వ్యాపారులతో కలిసి బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని, సిగ్గు శరం లేకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆరోపించారు.