MLC Election Polling Ends: ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్.. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంల్లో నిక్షిప్తం

MLC Election Polling Ends in Telangana and Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఏపీలో 3, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఏపీలో రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఇక, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ సమయం ముగిసే నాటికి పశ్చిమ గోదావరి జిల్లాలో 65.43 శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతోపాటు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లాలో 87.30 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసే సమయానికి 65.69 శాతం నమోదు అయింది.
హక్కు వినియోగించుకున్న చంద్రబాబు, లోకేష్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేశ్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో వారు ఓటు వేశారు. ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల్లో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పొన్నూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు.
ఇబ్రహీంపట్నంలో ఒకరి ఓటు మరొకరు..
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం జాకీర్ హుస్సేన్ డిగ్రీ కళాశాల బూత్ నెంబర్ 45లో క్రమ సంఖ్య 331లో గుంటుపల్లికి చెందిన పాటిబండ్ల జ్ఞానదీప్తి ఓటును మరొకరు వేశారు. ఓటు వేసేందుకు వెళ్లిన ఆమె ఓటు పోలైనట్లు పోలింగ్ అధికారులు తెలపడంతో ఖంగుతిన్నారు. వెంటనే ఎన్నికల సహాయ అధికారి వై.వెంకటేశ్వర్లు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఆయన పోలింగ్ అధికారులతో మాట్లాడారు. పోలింగ్ అధికారులు ఆమెకు చాలెంజ్ ఓటు వేసే అవకాశం కల్పించారు.
తెలంగాణలోని మూడు స్థానాల్లో..
తెలంగాణలోని మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో పోలింగ్ ముగిసింది. ఉమ్మడి కరీంనగర్- మెదక్-నిజామాబాద్- ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 40.61 శాతం, టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 63.49 శాతం పోలింగ్ నమోదు కాగా, వరంగల్- నల్లగొండ- ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 90 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. మార్చి 3వ తేదీన తుది ఫలితాలను ఎన్నికల కమిషన్ వెల్లడించనుంది. పెద్దపల్లిలో అత్యధికంగా 77.95 శాతం పోలింగ్ నమోదైంది. నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 90 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలింగ్ 80 శాతం దాటింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా 80 శాతం దాటింది.