Published On:

Israel On Iran War: ఆగిన యుద్దం.. లాభపడి నష్టపోయిన స్టాక్ మార్కెట్!

Israel On Iran War: ఆగిన యుద్దం.. లాభపడి నష్టపోయిన స్టాక్ మార్కెట్!

Israel On Iran War: ఇజ్రాయెల్‌- ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఉదయం భారీ లాభాల్లో దూసుకెళ్లాయి. చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. ఇరాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మిస్సైల్స్‌తో దాడులు చేస్తోందంటూ ఇజ్రాయెల్ ఆరోపించడంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో చివరికి సెన్సెక్స్‌ 158 పాయింట్ల లాభంతో 82 వేల 55 పాయింట్ల వద్ద ముగిసింది.

 

నిఫ్టీ 72 పాయింట్ల లాభంతో 25 వేల 44 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 81 పైసలు బలపడి 85.97గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో అదానీ పోర్ట్స్‌, టాటా స్టీల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎల్‌ అండ్ ‌టీ షేర్లు లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎన్టీపీసీ, మారుతీ సుజుకీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 69.39 డాలర్లు, బంగారం ఔన్సు 3వేల 334 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి.

ఇరాన్‌పై అమెరికా బంకర్‌ బస్టర్‌ బాంబులతో దాడి చేసిన తర్వాత అమెరికాపై ప్రతీకారంతో రగలిపోతోంది ఇరాన్‌. అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ఇరాన్‌ సుప్రీంలీడర్‌ అయతుల్లా ఖమేనీ ట్రంప్‌పై నిప్పులు చెరిగాడు. ప్రపంచంలో అమరికా పౌరులు ఏ మారు మూల ప్రాంతంలో కనిపించినా వారిపై దాడులు చేస్తామని హెచ్చరించారు. చెప్పిన విధంగా సోమవారం నుంచి తన కార్యాచరణను మొదలుపెట్టింది ఇరాన్‌.

 

ముందుగా బోణి ఖతర్‌లోని అల్‌ ఉదయెద్‌ ఎయిర్‌ బేస్‌తో పాటు ఇరాక్‌లోని ఎయిర్‌బేస్‌పై మొదలుపెట్టింది. ఖతర్‌ రాజధాని దోహా గగనతలంలో క్షిపణి దాడులతో మారుమోగిపోయింది. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. దీంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. తాజా ఇరాన్‌ దాడులతో ఖతర్‌, బహ్రేయిన్‌, కువైట్‌ గగనతలాలను మూసివేశాయి.

ఇవి కూడా చదవండి: