AP: ఏడాదిలోగా రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తా: సీఎం చంద్రబాబు

CM Chandrababu: అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై కేబినెట్ సమావేశం పూర్తైన తర్వాత సీఎం ప్రస్తావించారు. ఇటీవల మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన.. కాన్వాయ్ ప్రమాదంపై చర్చించారు. రప్పా..రప్పా వ్యాఖ్యల విషయంలో వైసీపీకి ఇబ్బందులు వచ్చాయని మంత్రులు ప్రస్తావించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి వ్యాఖ్యలు ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదని పలువురు మంత్రులు అన్నారు. రప్పా.. రప్పా వంటి వ్యాఖ్యలను జగన్ సమర్ధించడం బాగా నష్టం కలిగించిందని చెప్పారు. ఇక, బనకచర్ల ప్రాజెక్ట్ పై ఎవరూ బహిరంగంగా మాట్లాడకూడదని మంత్రులకు సీఎం సూచించారు. SIPB సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. DRC మీటింగ్‌లను, నియోజకవర్గ ప్లానింగ్ మీటింగ్స్ కండక్ట్ చేయాలని నిర్ణయించారు.
ఇక రాజధాని అమరావతిలో చేపడుతున్న మలివిడత భూ సమీకరణపై మంత్రివర్గంలో చర్చించారు. తొలి విడత భూసమీకరణకు వర్తించిన నిబంధనలే మలివిడత భూసమీకరణకు వర్తింపచేయాలని నిర్ణయం తీసుకున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలు ఇన్చార్జ్ మంత్రి నేతృత్వంలో జిల్లా స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఏడాదిలోగా అన్ని రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని మరోసారి తేల్చి చెప్పారు సీఎం చంద్రబాబు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు ఉంటే ఎన్నిసార్లైనా తనతో మాట్లాడొచ్చు అని స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యల సాకుతో సమస్య దాటవేత ధోరణి సరికాదని సీఎం అన్నారు. రెవెన్యూ సమస్యలపై తాను తరచూ అడుగుతూనే ఉంటానని గట్టిగా చెప్పారు.