Revanth Reddy: రైతుల ఆశీర్వాదం వల్లే చిన్నవయస్సులో సీఎం అయ్యాను : రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy Participated ‘Rythu Nestham’ Program: రైతు భరోసా పథకాన్ని విజయవంతంగా పూర్తి చేశామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వ్యవసాయాన్ని దండగ అనే స్థాయి నుంచి పండుగ చేసేందుకే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆనాడు ఉచిత కరెంట్ అందించారని గుర్తుచేశారు. రైతుల ఆశీర్వాదంతోనే చిన్నవయస్సులో సీఎం అయ్యానని, రైతన్నల అభివృద్ధికి కృషిచేస్తానని మాట ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుభరోసా నిధుల పంపిణీ కార్యక్రమం ఈ రోజుతో పూర్తయింది. 9 రోజుల్లో రూ.9 వేల కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. రైతుభరోసా కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన సందర్భంగా అంబేద్కర్ సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు.
ప్రజాప్రభుత్వంలో తమ మొదటి ప్రాధాన్యం రైతులేనని చెప్పారు. రైతుల తర్వాత మహిళలు, యువత తమ ప్రాధాన్యమన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో మాట ఇచ్చి నిలబెట్టుకున్నామన్నారు. 25 లక్షల మందికిపైగా రైతులకు రుణమాఫీ చేశామన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్లే అని ఆనాడు చెప్పారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సన్నవడ్లు పండిస్తే బోనస్ ఇస్తామని చెప్పామని, 48 గంట్లలో డబ్బు జమ చేశామన్నారు. దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రమని గర్వంగా చెప్పుకొంటున్నామన్నారు. వ్యవసాయం అంటే రైతును రాజును చేయడమే అన్నారు.
కేసీఆర్ రూ.8 లక్షల కోట్లకుపైగా అప్పులు తమ నెత్తిన పెట్టి వెళ్లారని దుయ్యబట్టారు. రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని, ఇప్పుడు కూలిపోయిందన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుకు ఫామ్‌హౌస్‌లు ఎలా వచ్చాయి? రాష్ట్రం దివాలా తీస్తే వాళ్లంతా ఎలా సంపన్నులయ్యారు? అని ప్రశ్నించారు. కేసీఆర్ వేలాది ప్రభుత్వ పాఠశాలలు మూత వేయించారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 60 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. గ్రామాల్లో అమ్మ ఆదర్శ పాఠశాలలు తీసుకువచ్చామన్నారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. మహిళలు సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేలా చర్యలు చేపట్టామని, వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్‌పై విద్యుత్‌శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. మహిళలకు రూ.21వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చి ఆదుకున్నామని పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల విక్రయానికి చర్యలు చేపట్టామని చెప్పుకొచ్చారు.
శిల్పారామంలో 150 షాపుల ఏర్పాటుకు స్థలం కేటాయించామని గుర్తుచేశారు. వెయ్యి బస్సులు కొని ఆర్టీసీకి మహిళలు అద్దెకు ఇచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. 8 వేల ఐకేపీ కేంద్రాలను మహిళల చేతుల్లో పెట్టామన్నారు. పాఠశాలల్లో ఆహార పదార్థాల సరఫరా బాధ్యతను స్వయం సహాయక సంఘాలకు అప్పగించామని పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, 18 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చ పెట్టాలన్నారు.